
అత్తగారింట్లో నుంచి కోడలిని వెళ్లగొట్టలేరు
ఉమ్మడి నివాసంలో ఆమెకు నివసించే హక్కుంటుంది
ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి కాపురం ఉన్న కోడలికి ఆ ఇంట్లో నివసించే హక్కును తిరస్కరించటం గృహసింహ చట్టం ప్రకారం సాధ్యం కాదని ఈ నెల 16న జస్టిస్ సంజీవ్‌నారుల్ స్పష్టంచేశారు. ఆ ఇంట్లో నుంచి కోడలిని వెళ్లగొట్టాలంటే చట్టప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
ఇదీ కేసు..
ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడికి 2010లో వివాహం జరిపించింది. అప్పటినుంచి అత్త, మామ, కొడుకు, కోడలు ఒకే ఇంట్లో ఉన్నారు. అయితే, 2011 నుంచి తల్లిదండ్రులతో కుమారుడికి గొడవలు మొదలు కావటంతో కొంతకాలం కొడుకు, కోడలు తమ సొంత ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిపై కొడుక్కు ఎలాంటి హక్కులు లేవని తల్లిదండ్రి ప్రకటించారు. ఆ ఆస్తి తమ స్వార్జితమని, దానిపై తమకే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత కొంతకాలానికి కోడలు తిరిగి అత్తగారింటికి రావాలని నిర్ణయించుకుంది. కానీ, అప్పటికే ఆమె వస్తువులన్నీ ఆ ఇంట్లో నుంచి తీసివేశారు. అయినా, ఆమె ఆంట్లోకి తిరిగి వచ్చింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ అత్తమామ హైకోర్టును ఆశ్రయించారు.
తమ కుమారుడినే త్యజించామని, అలాంటప్పుడు కోడలికి తమ ఇంట్లో నివసించే హక్కు లేదని వాదించారు. ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. కోడలిగా అత్తగారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆమెకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. అత్తమామలు తన భర్తకు హక్కులు నిరాకరించినా, ఆమె హక్కులను కాదనలేరని తేల్చి చెప్పింది. అత్తమామ ఇంట్లో మొదటి అంతస్తులో, కోడలు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించాలని సూచించింది.
గృహసింహ చట్టంలోని సెక్షన్ 17(1) ప్రకారం కుటుంబసభ్యురాలిగా ఉన్న మహిళలకు వారి ఉమ్మడి ఇంట్లో నివసించే అధికారం, హక్కు ఉంటాయని తెలిపింది. సెక్షన్ 17(2) ప్రకారం ఆ మహిళలను ఉమ్మడి ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలంటే కచ్చితంగా చట్టప్రకారమే వెళ్లాలని స్పష్టంచేసింది. కొడుకు కోడలు తమ ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని నాశనం చేశారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. కొడుకు, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఉమ్మడి కుటుంబ వాతావరణం చెడిపోయినట్లు కాదని వివరణ ఇచ్చింది.