ఆట పేరుతో పిల్లలతో కాళ్లు, చేతులు.. కళ్లకు గంతలు కట్టించిన కోడలు
ఆపై క్షణాల్లో పెట్రోల్ పోసి దీపం విసిరిన కాలాంతకురాలు
దీపం జారిపడి అంటుకుందని కట్టుకథ
24 గంటల్లో కేసును చేధించిన పెందుర్తి పోలీసులు
విశాఖపట్నం జిల్లా: పెళ్లి నాటినుంచీ పొసగని అత్తను ఒక కోడలు అత్యంత కిరాతకంగా.. అచ్చం హర్రర్ క్రైం సినిమా స్టోరీని తలపించే రీతిలో హతమార్చిన ఘటన ఇది. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపాన అప్పన్నపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై విశాఖ వెస్ట్ జోన్ ఏసీపీ పృద్వితేజ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పన్నపాలెంలో వర్షిణి అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో జయంతి సుబ్రహ్మణ్యం, ఆయన భార్య లలితాదేవి (30), తల్లి జయంతి కనకమహాలక్ష్మి (63), పిల్లలు ఈశ్వర్‌చంద్ర, శ్రీనయన, మేనల్లుడు శరత్‌తో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం–లలితాదేవికి 12 ఏళ్ళ క్రితం పెళ్లయ్యింది. అత్తాకోడళ్లు లలితాదేవి, కనకమహాలక్ష్మికి పెళ్లయిన తొలినాళ్ల నుంచే విభేదాలు తలెత్తాయి.
ఇద్దరికి రోజూ ఏదో విషయంలో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అత్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లలిత నిర్ణయించుకుంది. హత్యచేసి ఎలా తప్పించుకోవాలన్నది తెలుసుకోడానికి యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసింది. తద్వారా ఒక పథకం సిద్ధం చేసుకుంది. ఈ నెల 6న సింహచలం గోశాల వద్ద ఉన్న బంక్‌లో సీసాలో లీటరు పెట్రోలు తీసుకుని ఇంట్లో దాచిపెట్టింది. శుక్రవారం ఉదయం భర్త సుబ్రహ్మణ్యం, మేనల్లుడు శరత్ పనిమీద బయటకు వెళ్లారు.
అత్తను హత్య చేసేందుకు అదే తగిన సమయమని భావించింది. ‘నాన్నమ్మతో దొంగాపోలీస్ ఆట ఆడి.. ఆమెను తాళ్లతో కట్టేసి కళ్లకు గంతలు కట్టండి’ అని పిల్లలకు పురమాయించింది. విషయం తెలియని పిల్లలు నాన్నమ్మను అడగ్గా.. కనకమహాలక్ష్మి పిల్లల సరదా కోసం ఒప్పుకుంది. అంతే పిల్లలు తాళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు వేయడంతో కనకమహాలక్ష్మిపై అప్పటికే సిద్ధం చేసుకున్న పెట్రోల్‌ను క్షణాల్లో ఆమెపై పోసి, దేవుడి పటాల వద్ద ఉన్న దీపాన్ని ఆమె మీదకు విసిరింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని కనకమహాలక్ష్మి పెద్దగా కేకలు వేయడంలో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే శరీరం పూర్తిగా కాలిపోయిన కనకమహాలక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
కాగా, దీపం జారిపడటంతో మంటలు అంటుకుని తన అత్త ప్రమాదానికి గురైనట్టు ప్రజలతో పాటు పోలీసులను లలిత నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు పెట్రోల్ వాసన గమనించి తమదైన శైలిలో విచారణ చేయగా నిందితురాలు నేరం ఒప్పుకుంది. హతురాలి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కుమార్తె శ్రీనయనకు స్వల్ప గాయాలయ్యాయి.



