దేశరాజధానిలో జరిగిన మంగళవారం రాత్రి జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎనిమిదేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ లైంగికదాడి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది తెలిసిందే. ఈ కేసు నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని నిరసిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగగా.. భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపడేశారు.
ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్ దక్కడంపై నిరసనగా బాధితురాలు, ఆమె తల్లి ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టబోయారు. ఆ సమయంలో యోగితా భయానా అనే యాక్టివిస్ట్ వాళ్లతో పాటు ఉన్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడమంటే తమ ప్రాణాలకు గ్యారెంటీ లేదంటూ ఆ తల్లీకూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది వాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేసి అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లి బస్సు నుంచి కింద పడిపోయినట్లు తెలుస్తోంది.
తొలుత ఇండియా గేట్ వద్ద, ఆ తర్వాత మండీహౌజ్ వద్ద బాధితుల్ని సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వాళ్లను బలవంతంగా తమ వాహనాల్లో తరలించారు. ఆ రెండు చోట్లా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదని అధికారుల తెలిపారు.
JUSTICE DETAINED
Rapist's Sentence Suspended
Unnao rape victim dragged into police van by @AmitShah's Delhi Police, protesting against suspension of sentence of former @BJP4India MLA RAPIST-MURDERER Kuldeep Singh Sengar#KuldeepSinghSengar#StockMarketIndia #PlaneCrash pic.twitter.com/vYApILE9kN— Taj INDIA (@taj_india007) December 24, 2025
2017లో వెలుగు చూసిన ఉన్నావ్ కేసులో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి (Unnao rape case) పాల్పడడంతో పాటు ఆమెను అమ్మేసే ప్రయత్నం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు.. బాధితురాలి తండ్రి మరణానికి కూడా కారణమయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో..
ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ 16న 2019 దోషిగా తేల్చి.. డిసెంబర్ 20న జీవిత ఖైదు విధించింది. అయితే.. సెంగర్‌కు శిక్ష పడక ముందే.. ఎన్నో పరిణామాలు జరిగాయి. అదే ఏడాది కేసు సీబీఐ విచారణ జరుగుతుండగానే.. బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి బాధితురాలు బయటపడగా.. ఆమె ఇద్దరు బంధువులు మరణించారు.
జీవిత ఖైదు పడడంతో 2020 నుంచి సెంగర్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2027 అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే కుల్దీప్‌కు బెయిల్ దక్కిందని రాజకీయ ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు.. తర్వాత పోయేది తన ప్రాణమేనంటూ బాధితురాలు, ఆమె తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు న్యాయం జరగలేదు. నా కుమార్తెను బంధించారు. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. అధికారులు (సీఆర్‌పీఎఫ్)సిబ్బంది బాధితురాలిని బలవంతంగా తీసుకెళ్లి, తాను రోడ్డుపై పడేశారు.
సెంగర్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అతను సంచరించకూడదని.. వాళ్లను బెదరించే ప్రయత్నం చేసినా బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. అయినప్పటికీ.. నిందితుడికి బెయిల్ రావడంపై అభ్యంతరాలతో నెట్టింట చర్చ నడుస్తోంది.
ఉన్నావ్ కేసు టైమ్‌లైన్
జూన్ 4, 2017 – 17 ఏళ్ల బాలిక ఉన్నావ్ జిల్లా, మఖి గ్రామంలో కనిపించకుండా పోయింది. ఆమెను కుల్దీప్ సింగ్ సేంగర్, అతని సోదరుడు అటుల్ సింగ్ ఇతరులు అత్యాచారం చేశారు.
జూన్ 21, 2017 – బాధితురాలు ఔరయ్యలో ప్రత్యక్షమైంది.. పోలీసులు ఆమెను రక్షించారు
జూన్ 22, 2017 – పోలీసులు IPC సెక్షన్లు 363, 366 కింద కేసు నమోదు చేశారు.ఏప్రిల్ 3, 2018 – బాధితురాలి తండ్రిని సేంగర్ సోదరుడు అటుల్ మరియు అనుచరులు కొట్టి, తర్వాత జైలులో మరణించాడు.
ఏప్రిల్ 8, 2018 – బాధితురాలు లక్నోలో CM యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. దీని తర్వాత కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.
ఏప్రిల్ 2018 – CBI దర్యాప్తు ప్రారంభమైంది.
జూలై 2019 – బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంధువులు మరణించారు.
డిసెంబర్ 16, 2019 – ఢిల్లీ కోర్టు సేంగర్‌ను అత్యాచారంలో దోషిగా తేల్చింది.
డిసెంబర్ 20, 2019 – సేంగర్‌కు జీవితఖైదు శిక్ష విధించారు.
2020–2024 – సేంగర్ జైలులో శిక్ష అనుభవించాడు
డిసెంబర్ 23, 2025 – ఢిల్లీ హైకోర్టు సేంగర్ జీవితఖైదు శిక్షను కొట్టేసి.. కండిషన్ బెయిల్ ఇచ్చింది


