మెడికల్ కాలేజీలకు ఒకే దరఖాస్తు
వైఎస్ జగన్ మాటతో బిడ్డర్ల వెనుకడుగు
మళ్లీ జగన్ గెలుస్తారన్న నమ్మకంతోనే..
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక ప్రయివేటుకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టాం. కోటికిపైగా సంతకాలు సేకరించాం..
.. మళ్ళీ చెబుతున్నాం.. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తె మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేం అధికారంలోకి వస్తే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన లాంటి హెచ్చరిక ప్రయివేటు మెడికల్ కాలేజీల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించింది. అందుకేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.. కార్పొరేట్ సంస్థలు ఏవీ పెద్దగా ఈ అంశంలో ముందుకు రాలేదు.
వాస్తవానికి మార్కాపురం.. మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నది. అంటే మొత్తం నాలుగు కాలేజీలకు గాను ఒకటే దరఖాస్తు వచ్చింది. మిగతా మూడు కాలేజీలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.
ఈ పరిణామం చూస్తుంటే వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం అయన చేసి తీరతారన్న నమ్మకం, మళ్ళీ అయన వస్తే కాలేజీలు వెనక్కి తీసుకుంటారన్న భయం కలగలిపి వారిని ఈ బిడ్డింగ్ నుంచి వెనకడుగు వేసేలా చేసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు.. వివిధ వర్గాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటున్న మెడికల్ వ్యాపారవేత్తలు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు భావిస్తున్నారు.
రాష్ట్రంలో వైయస్ జగన్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టినా వెల్లువెత్తుతున్న జనాభిమానం ఒకవైపు.. అటు రైతులు,, మహిళలు.. విద్యార్థులు.. యువత వంటి వర్గాల్లో జగన్ పట్ల పెరుగుతున్న సానుకూలత, అదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతలను క్రోడీకరించి మెడికల్ వ్యాపారులు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తే రానున్న మూడేళ్ళలో ఇది మరింత పెరగడం తధ్యమని, అది కూటమి ఓటమిని, వైఎస్ జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని భావించిన బిడ్డర్లు ఇక ఈ అంశం జోలికి పోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ గెలుపు తథ్యం, అదే జరిగితే కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న ఈ కాలేజీలను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటే భారీగా నష్టపోతామన్న భయంతోనే వారు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ వ్యాపారులు ముందు చూపుతో వేసిన వెనకడుగు.. వైఎస్ జగన్ విజయానికి సూచనే అని తేల్చేశారు.
:::సిమ్మాదిరప్పన్న


