మహిళ జీవితంలో బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తినంత పనే. ఈ సమయంలో గర్భిణీకి అటు అత్తింటివారు, ఇటు పుట్టింటి వారు చాలా అండగా ఉంటారు. ప్రసవం పూర్తయి, తల్లీ బిడ్డ క్షేమంగా ఉండే దాకా చాలా ఆందోళన పడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రసూతి వార్డులో జరిగిన ఒక సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.
పురుటి నొప్పులతో బాధపడుతున్నకోడల్ని ఓదార్చి, ధైర్యం చెప్పాల్సిన అత్తగారు దారుణంగా ప్రవర్తించింది. దీనిపై గైనకాలజిస్ట్ షేర్ చేసిన వీడియో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది .ఈ సంఘటన ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగింది.
వారణాసి నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రికి మహిళ ప్రసవం కోసం వచ్చింది. సహజం ప్రసవంకావాలని పట్టుబడుతూ కోడలిపై అరవడం మొదలు పెట్టింది. "నోరు మూసుకో, లేకపోతే మూతి పగలగొడతా అంటూ బెదిరించింది. ఇదంతా జరుగుతున్నపుడు, బాధిత మహిళ భర్త, ఇతర కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. కొంత వాగ్వాదం, కోడలి పరిస్థితి చూసిన తరువాత వారు సిజేరియన్‌కు అనుకూలంగా ఉన్నారు. కానీ అత్తగారు మాత్రం సహజ ప్రసవానికి పట్టుబడుతుండటం ఈ వీడియోలో చూడవచ్చు. "ఇలా ఏడుస్తూ ఉంటే తల్లి ఎలా అవుతావు?" అంటూ మండిపడింది. తన అంతేకాదు భార్య చేయి పట్టుకున్న కొడుకుని వారించింది. ఇతర కుటుంబ సభ్యులు ఆమెను శాంతింప జేయడానికి ప్రయత్నించినా ఆమె ధోరణికి అడ్డుకట్ట పడలేదు. మొత్తానికి ఆపరేషన్ లేకుండానే, సహజంగానే పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సమయంలో ఆమెతో ప్రేమగా ఉండాలి
ఈ సంఘటనపై స్పందిస్తూ, గైనకాలజిస్ట్ డాక్టర్ నాజ్ ఫాతిమా, ఆమె మొదట ఏదో తమాషా చేస్తోందిలే అనుకున్నా.. కానీ ఇలాంటి పరిస్థితులలో, కుటుంబం గర్భిణీ స్త్రీని ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవాలి. అనునయంతో, ఓదారుస్తూ మాట్లాడాలి కదా అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
నెటిజన్లు స్పందన
పెద్దవాళ్లు తోడుగా ఉండాలి గానీ ఇలా ప్రవర్తించకూడదు, ఇంత మొరటుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ పరిస్థితిలో ఆమెకు ధైర్యం చెప్పాలి అని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పగవాళ్లకి కూడా ఇలాంటి అత్తగారు ఇలా ఉండాలని కోరుకోను, ఈ సమయంలో కూడా కొడుకు తన భార్య చేతులు పట్టు కోవడం ఆమె భరించలేకపోతోంది అని మరొకరు వ్యాఖ్యానించారు. అయ్యో.. ఆమె అలా అరుస్తోంటే, భర్త ఏంటి ఏమీ మాట్లాడడు, భార్య కోసం స్టాండ్ తీసుకోవాలి కదా అంటూ మరొకరు మండిపడ్డారు.
ఇదీ చదవండి: లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో


