వేయి వాక్యాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటో పట్టిచూపుతుందని ఒక విశ్లేషణ. అలా 2025 ఏడాదిలో విశ్వవ్యాప్తంగా పలు ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి.
సమాజంపై ప్రభావితంచూపిన, చర్చనీయాంశమైన చిత్రాలివి..
పెళ్లయి కాళ్లకు పారాణి కూడా ఆరకముందే ఉగ్రవాదుల పైశాచికకాండలో భర్తను కోల్పోయి అతని మృతదేహం వద్ద నిశ్చేష్టురాలై కూలబడిన నవ వధువు ఫొటో ఇది. 
పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లు నిండిపోయిన భారత నావికాదళాధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోగా కాపాడండి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరచి అలసిపోయిన భార్య హిమాన్షీ ఫొటో ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలో ప్రచురితమైంది. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం పరిధిలోని బైసారన్ పచ్చికబయళ్లలో అమాయక పర్యాటకులపై ఉగ్రమూకలు దాడిచేయడం, అందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేయడం తెల్సిందే.

అగ్రరాజ్యాధినేత అధికారి నివాసం వైట్‌హౌస్ ఒక్కసారిగా రచ్చబండగా మారిన అరుదైన క్షణం తాలూకు ఫొటో ఇది. మాట్లాడుకుందాం అంటూ ఆహా్వనించి మీడియా ప్రతినిధుల ఎదుట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్కువచేసి మాట్లాడటం, దానికి జెలెన్‌స్కీ దీటుగా బదులివ్వడం, చివరకు ద్వైపాక్షిక భేటీ వాగ్వాదాలమయంగా మారడం తెల్సిందే. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ వాగ్వాదాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రపంచదేశాలన్నీ చూశాయి. అతిథిని అవమానించిన ట్రంప్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం గాల్లోకి లేచిన 32 సెకన్లకే ఎదురుగా ఉన్న వైద్యకళాశాల భవనంపై కుప్పకూలిన అత్యంత విషాధ ఘటన తాలూకు ఫొటో ఇది. 12 మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలి అగ్నిగుండంగా మారి బూడిదైంది. ఈ ఘటనలో ఒక్కరే బతికి బయటపడ్డారు. విమానంలో సాంకేతిక లోపమా? పైలట్ తప్పిదమా అనేది మిస్టరీగా మారింది. దేశీయ విమానయాన రంగ భద్రతపైనా ఈ దుర్ఘటన నీలినీడలు కమ్మేలా చేసింది.

వేగంగా మండే స్వభావమున్న వెదురు కర్రలు, స్టీరోఫోమ్ కిటికీలను నెలలతరబడి మరమ్మతుల కోసం వినియోగించడంతో అనుకోకుండా అంటుకున్న నిప్పురవ్వలు చివరకు హాంకాంగ్‌లోని ప్రముఖ వాంగ్‌ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ బహుళ అంతస్తుల భవనాలను నిలువునా బూడిదచేసిన దారుణోదంతం ఫొటో ఇది. ఈ ఘటనలో ఏకంగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తర్వాత హాంకాంగ్‌లో వెదురు కర్రలు, స్టీరోఫోమ్ వినియోగంపై పెద్ద చర్చే మొదలైంది.

అవినీతి, వారసత్వ రాజకీయాలు, నేతల విలాసవంత జీవితం, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన నేపాల్ యువత ఉవ్వెత్తున నిరసనోద్యమంగా ఎగసిపడిన క్షణం నాటి ఫొటో ఇది. జెన్ జెడ్ ఉద్యమంగా నేపాల్ ప్రధాన నగరాల్లో వేలాదిగా బారులుతీసిన విద్యార్థులు ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోశారు. ఈ దెబ్బకు సెపె్టంబర్ 9న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, కేబినెట్ మంత్రులు పదవులకు రాజీనామాచేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం తెల్సిందే. వారం తిరిగేలోపే మాజీ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

గాజాపై నెలల తరబడి వేల కొద్దీ బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఇళ్లు, ఆస్పత్రులు సహా ప్రతి కట్టడం కుప్పకూలడంతో నిలువనీడలేక, తినడానికి తిండిలేక, దుర్భర దారి్రద్యంలో బతుకీడుస్తూ అన్నదాన శిబిరాల వద్ద గిన్నె పట్టుకుని ఆహారం కోసం పోటీపడుతున్న చిన్నారులు వీరంతా. ఈ ఏడాది మొదట్లో గాజాలో ఓ శరణార్థి శిబిరంలో తీసిన ఈ ఫొటో అక్కడి దయనీయ స్థితికి అద్దంపడుతోంది. ఇకనైనా ఇజ్రాయెల్ దారుణదాడులను నిలిపివేయాలని ప్రపంచదేశాలు వేడుకుంటున్నా అమెరికా అండతో ఇజ్రాయెల్ ఈ అభ్యర్థనలను పెడచెవిన పెడుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


