2025: ట్రంప్‌ నామ సంవత్సరం | Top 10 personalities in the worldwide made headlines in 2025 | Sakshi
Sakshi News home page

2025: ట్రంప్‌ నామ సంవత్సరం

Dec 28 2025 5:08 AM | Updated on Dec 28 2025 5:09 AM

Top 10 personalities in the worldwide made headlines in 2025

ఈ ఏటి టాప్‌ 10 న్యూస్‌ మేకర్స్‌ 

ట్రంప్‌ నుంచి శుభాంశు దాకా 

ఉత్థాన పతనాల ఎలాన్‌ మస్క్‌ 

మహిళా శక్తికి ప్రతీకగా కల్నల్‌ సోఫియా, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా 

రికార్డు కలెక్షన్లతో దుమ్ము రేపిన టేలర్‌ స్విఫ్ట్‌ 

కాలం నిజంగానే మాయల మరాఠీ. రెప్పపాటే అనిపిస్తుంది గానీ చూస్తుండగానే శరవేగంగా సాగిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. మంచీ చెడుల మిశ్రమ అనుభూతులు పంచి 2025 త్వరలో వీడ్కోలు చెప్పనుంది. 

ఈ సంవత్సరంలో ఎంతోమంది ప్రముఖులు మెరుపులు మెరిపించారు. కొందరు మరకలు అంటించుకుని తల దించుకున్నారు. ఇంకొందరు అనన్య సామాన్యమైన సాహసాలు, రికార్డులతో ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. అలా 2025లో వార్తల్లో వ్యక్తులుగా నిలిచి అందరి నోళ్లలోనూ నానిన టాప్‌ 10 ప్రముఖుల గురించి ఒకసారి చూద్దాం...

తంపులమారి (డొనాల్డ్‌ ట్రంప్‌) 
నిస్సందేహంగా 2025 ట్రంప్‌ నామ సంవత్సరమే అని చెప్పాలి. మీడియా వ్యతిరేకత, దు్రష్పచారాల మోత తదితరాలను సమర్థంగా కాచుకుంటూ 78 ఏళ్ల లేటు వయసులో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఔరా అనిపించారు. కానీ ఈ ఏడాది మొదట్లో పీఠమెక్కింది మొదలు రోజుకో ఆకస్మిక నిర్ణయంతో దేశాల గుండెల్లో అక్షరాలా రైళ్లు పరుగెత్తించారు. ముఖ్యంగా ఆయన ఎడాపెడా బాదిన టారిఫ్‌ల ధాటికి భారత్‌ తో సహా చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరే అయ్యాయి. అయితే వాటిని అంతే వేగంగా తగ్గించడం, రద్దు చేయడం వంటి చర్యలతో ట్రంప్‌ నవ్వులపాలు కూడా అయ్యారు.

 అమెరికాతో పరువుతో పాటు అగ్ర రాజ్య అధ్యక్ష పీఠం హుందాతనాన్నీ తన ప్రవర్తనతో పలుమార్లు పలుచన చేశారు. ముఖ్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్, పాక్‌ ఘర్షణలను తానే ఆపానని ఇప్పటికి కనీసం 75 సార్లకు పైగా ప్రకటించుకున్నారు. భారత్‌ నిర్ద్వంద్వంగా ఖండించినా, పాక్‌ కాళ్లబేరానికి వచ్చినందుకే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసినా పట్టించుకోలేదు. 

ఈ విషయంలో సెంచరీ కొట్టడమే ట్రంప్‌ లక్ష్యం కనిపిస్తోందంటూ సోషల్‌ మీడియాలో జోకులు కూడా పేలాయి. రష్యా–ఉక్రెయిన్, గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధాలను కూడా చిటికెలో ఆపేస్తానంటూ బీరాలు పలికినా అవిప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గాజాను స్వా«దీనం చేసుకునేందుకు, వెనిజులాలోని చమురు నిల్వలను చెర పట్టేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా కాక రేపుతున్నాయి. రెండో టర్ములో ఇంకా ఏడాదైనా పూర్తవకుండానే ఇన్ని చుక్కలు చూపిన తంపులమారి ట్రంపు 2026లో ఇంకెంత విశ్వరూపం చూపుతారో చూడాలి!

నిప్పులు చిమ్మి... 
(ఎలాన్‌ మస్క్) 
ఈ ప్రపంచ కుబేరునికి 2025 అక్షరాలా ఒక పీడకలగా మిగిలిపోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌ తో కుదిరిన దోస్తీ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. దాంతో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకంటూ ట్రంప్‌ తనకు అప్పగించిన డోజ్‌ సారథ్యం కూడా అటకెక్కింది. చూస్తుండగానే ట్రంప్‌ తో మస్క్‌ విభేదాలు రచ్చకెక్కాయి. వారి రచ్చ నిత్యం వార్తల్లో నిలిచింది. దాంతో మస్క్‌ కంపెనీలు ఎక్స్, టెస్లా షేర్లు ఈ ఏడాదంతా భారీగా నేల చూపులే చూశాయి. కాకపోతే, ఏదో ఒక రూపంలో నిత్యం పతాక శీర్షికల్లో మాత్రం నిలవడం ఒక్కటే ఆయనకు ఊరట!

నిరసన పతాక 
(మరియా కొరీనా మచాడో) 
వెనిజులా విపక్ష నేత. మదురో నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసిన మడమ తిప్పని పోరాటానికి ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి ఆమెను వచ్చి వరించింది. దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపే పోరాటంలో అవసరమైతే ప్రాణార్పణకు కూడా సిద్ధమంటూ కొన్నాళ్ల క్రితం ఆమె చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంది. ఆమెకు నోబెల్‌ బహుమానం నేపథ్యంలో వెనిజులాలో మానవ హక్కుల ఉల్లంఘన, మదురో నియంతృత్వం తదితరాలు మరోసారి చర్చల్లో నిలిచాయి. ట్రంప్‌ ను వెనక్కి నెట్టి మరీ ఆమె నోబెల్‌ శాంతి పురస్కారం అందుకోవడం విశేషం. అయితే, ’వెనిజులా ప్రజాస్వామిక పోరాటానికి ఇస్తున్న నిరంతర మద్దతుకు’ గాను ఆమె తన పురస్కారాన్ని ట్రంప్‌ కు అంకితం చేయడం విశేషంగా నిలిచింది. మచాడో తరఫున ఆమె కూతురు ఇటీవలే నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

కుట్రలకు బలి  
(షేక్‌ హసీనా)
బంగ్లాదేశ్‌ లో తెర వెనక కుట్రలకు బలైన మరో నేతగా నిలిచిన మాజీ ప్రధాని. భారత్‌ తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించడమే ఆమె పాలిట శాపమైంది. విద్యార్థులు, యువత మాటు మతోన్మాద, భారత వ్యతిరేక శక్తులు ఆజ్యం పోసిన అల్లర్లకు ప్రధాన లక్ష్యంగా మారారు. ప్రధాని పదవిని, దేశాన్ని వీడి భారత్‌ కు పారిపోయి వచ్చారు. అనంతరం పలు నేరాలపై అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష తో సహా పలు కఠిన శిక్షలు విధించాయి. ఆమె పార్టీ అవామీ లీగ్‌ గుర్తింపు కూడా రద్దయింది. 15 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన హసీనా ఇప్పుడు 78 ఏళ్ల వయసులో పొరుగు దేశంలో చివరి రోజులు గడపాల్సిన పరిస్థితిలో పడ్డారు.

    నారీ శక్తులు   
(వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి) 
నారీ శక్తికి ప్రతిరూపాలు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పాక్‌ లో మన సైన్యం సాగించిన విధ్వంసం తాలూకు విశేషాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరి స్తూ 3 రోజుల పాటు ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించారు. పాక్‌ తప్పుడు ప్రచారాలను రుజువులతో సçహా ఎండగట్టారు. యుద్ధరంగంలోనే గాక మీడియా వార్‌ లో కూడా భారత్‌ ను తిరుగులేని స్థాయిలో నిలిపారు. దాంతో వారి పేర్లు చాలా రోజుల పాటు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ లో నిలిచాయి. అంతర్జాతీయ సైనిక కవాతులో భారత దళానికి సారథ్యం వహించిన తొలి మహిళా ఆఫీసర్‌ అన్న రికార్డు సోఫియాది. కాగా వైమానిక దళంలో ఉజ్వలమైన కెరీర్‌ తో దేశ మహిళలకు స్పూర్తినిచ్చారు వ్యోమిక.

వ్యోమ వీరుడు (శుభాంశు శుక్లా) 
ఆక్సియం – 4 మిషన్‌ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్‌ శర్మ తర్వాత అంతరిక్షంలో కాలు పెట్టిన రెండో భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఈ ఏడాది మన నెటిజన్లు అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 పేర్లలో చేరారు.  వైమానిక దళ గ్రూప్‌ కెప్టెన్‌ అయిన శుభాంశు అంతరిక్ష యాత్ర దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆ రంగం పట్ల ఎనలేని ఆసక్తిని పెంచింది.  

జపాన్‌లో నారీ భేరి (సనాయే టకైచీ) 
ఈ అక్టోబర్‌ లో జపాన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాజకీయ రంగంలో స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సంప్రదాయం ప్రబలంగా ఉన్న జపాన్‌ లో ఇది నిజంగా అనూహ్యమే. అయితే టకైచీ కేబినెట్‌ మాత్రం పూర్తిగా పురుషులతోనే కిటకిటలాడిపోవడం విశేషం. దాంతో, స్త్రీ శక్తిపరంగా నిజమైన మార్పులను ఊహించిన వారంతా ఆశాభంగమే చెందారు.

నూతన సారథి (పోప్‌ లియో 14) 
పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణానంతరం సుదీర్ఘ ఎంపిక ప్రక్రియ అనంతరం వాటికన్‌ పగ్గాలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్‌ కాథలిక్కులకు సారథిగా గత మే నెలలో కొలువుదీరారు. అమెరికా ఖండం నుంచి వచ్చిన తొట్ట తొలి పోప్‌ గా కొత్త చరిత్ర సృష్టించారు.

అప‘హాస్యం’ (సమయ్‌ రైనా, రణ్‌ వీర్‌ అలహాబాదియ) 
హాస్యం కాస్తా శ్రుతి మించితే ఏమవుతుందో ఫేమస్‌ యూట్యూబర్‌ రణ్‌ వీర్, స్టాండప్‌ కమెడియన్‌ రైనా వివాదం నిరూపించింది. తల్లిదండ్రులు, పిల్లల గురించి లైంగికపరంగా అత్యంత అసభ్యమైన కామెంట్లు, దివ్యాంగుల గురించి చౌకబారు వ్యాఖ్యలతో ప్రసారమైన వీరి  పాడ్‌ కాస్ట్‌ లు అందరి ఆగ్రహానికి గురయ్యాయి. చివరికి విషయం అంటున్న న్యాయస్థానం దాకా చేరింది. కోర్టు వాళ్లకు పదేపదే అక్షింతలు వేయాల్సి వచ్చింది. క్రియేటివ్‌ ఫ్రీడం పేరిట వెర్రితలలు వేసే పోకడలను భారత సమాజం హర్షించబోదని ఈ ఎపిసోడ్‌ మరోసారి చాటింది.

కాసుల వర్షమే (టేలర్‌ స్విఫ్ట్‌) 
సూపర్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ ఈ ఏడాది అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె ’ఎరాస్‌’ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సింగిల్‌ టూర్‌ గా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ షోలో భాగంగా స్విఫ్ట్‌ ఏకంగా ఐదు ఖండాల్లో 149 షోలు చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దాంతో ’ఎరాస్‌’ షో దాదాపుగా 200 కోట్ల డాలర్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement