మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆడపిల్ల అనే కోపంతో ఆరు సంవత్సరాల పసికందును సుప్రియ అనే ఓ కిరాతక తల్లి పొట్టన బెట్టకుంది. అనంతరం గుండెపోటుతో పాప మృతి చెందిందని కట్టుకథ అల్లింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర నావీ ముంబై కళంబోళిలో మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం చిన్నారి తండ్రి ఎప్పటిలాగా విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. అయితే రావడంతోనే పాప అపస్మారక స్థితిలో పడి ఉండడం చూశారు. దీంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలిచంగా అప్పటికే తను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే దీనిని గుండెపోటుగా చిత్రీకరించడానికి సుప్రియ ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు శవపరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో తనకు బాబు కావాలని ఉండేదని దానికి తోడు చిన్నారి మరాఠీ మట్లాడకపోవడంతో ఇంకా పగ పెంచుకుందని పోలీసులు తెలిపారు. గతంలోనూ సుప్రియ తన కూతురుకు పలుమార్లు హానీ కలిగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.


