అమూల్ సహా కొన్నిప్రముఖ భారతీయ పాల ఉత్పత్తుల బ్రాండ్లపై జరిపిన పరీక్షల్లో అధిక కోలిఫాం బ్యాక్టీరియా , ఇతర వాటిలో TPC పెరుగుదల కనిపించిందన్న వార్త సంచలనం రేపుతోంది. అమూల్ ఉత్పత్తులైన తాజా అండ్ గోల్డ్ పౌచ్ (Taaza and Gold pouch) పాలలో ప్రమాదకర బ్యాక్టీరియా స్థాయి ఎక్కువగా ఉందన్న వార్త వైరల్‌గా మారింది. ట్రస్టీ ఫైడ్ అనే స్వతంత్ర పరీక్షా వేదిక =నిర్వహించిన బ్లైండ్ టెస్ట్‌లో కోలిఫామ్ స్థాయి ఎక్కువ ఉందంటూ ఒక వీడియో హల్‌హల్ చేస్తోంది.
తాజా నివేదికల ప్రకారం అమూల్ ప్యాకెట్ పాల బ్రాండ్లలో కోలిఫాం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు పాల భద్రతపై ఆందోళనలు రేకెత్తించాయి. పాలలో కనిపించే కోలిఫామ్ స్థాయి FSSAI సూచించిన పరిమితుల కంటే 98 రెట్లు ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. అంతేకాదు మదర్ డైరీ, కంట్రీ డిలైట్ లాంటి ప్యాకెట్ పాల బ్రాండ్లలో కోలిఫాం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పాలలోని టోటల్ ప్లేట్ కౌంట్ (TPC) అనేది పాల నమూనాలోబ్యాక్టీరియా సంఖ్యను కొలవడానికి ఉపయోగించే ప్రయోగశాల పరీక్ష. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తనిఖీలు ముమ్మరం చేసింది.
కోలిఫామ్ అంటే ఏమిటి?
కోలిఫామ్ బ్యాక్టీరియా అనేది నేల, నీరు, వృక్షసంపద, జంతువుల ప్రేగులు మరియు మానవ ప్రేగులలో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా సమూహం. పాలలో కోలిఫామ్ అంటే మానవ వ్యర్థాల ద్వారా పాలు కలుషితం కావడమే. దీంతో సోషల్ మీడియా యూజర్లు పాల ఉత్పత్తుల్లోని పరిశుభ్రత ప్రమాణాలు, ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను అమూల్ కంపెనీ ఖండించింది.
అమూల్ స్పందన
తన ఉత్పత్తులన్నీ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని అమూల్ ప్రకటించింది. తయారీ వైఫల్యం లేదని, కానీ రిటైల్ లేదా పంపిణీ స్థాయిలో కోల్డ్ చైన్‌లో ఏదైనా విచ్ఛిన్నం జరిగే అవకాశం ఉందని కంపెనీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
ఏం చేయాలి?
ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కాలుష్యానికి గురికావడం ఉత్పత్తి , పాలు పితికే దశకు మాత్రమే పరిమితం కాదు, కానీ రవాణా, నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ లేదా రిటైల్ నిర్వహణ సమయంలో ఏదైనా కల్తీ జరిగే అవకాశం ఉంది. పేలవమైన ఉష్ణోగ్రత నియంత్రణ బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడుతుంది. పాశ్చరైజేషన్ ద్వారా హానికరమైన జీవులు తగ్గినప్పటికీ, ప్రాసెసింగ్ తర్వాత తగినంత నిల్వ లేకపోవడం కూడా బ్యాక్టీరియాకు కారణమవుతుంది. అందుకే ప్యాకెట్ పాలను మరిగించ కుండా వాడకూడదు. ప్యాకెట్ పాలను సరైన శీతలీకరణలో ఉంచేలా రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
పాలను ఫ్రిజ్‌లోనే పెట్టాలి. ముఖ్యంగా వేడి వాతావరణంలో పాలను ఎక్కువసేపు బయట ఉంచవద్దు.
లీక్ అవుతున్న, లేదా ఉబ్బిన ప్యాకెట్లును కొనుగోలు చేయవద్దు.
టెట్రా ప్యాక్ (UHT) మిల్క్ ప్యాకెట్లు అల్ట్రా-హై టెంపరేచర్ ట్రీట్‌మెంట్‌కు లోబడి ఉంటాయి, తెరిచే వరకు స్టెరైల్‌గా ఉంటాయికాబట్టి కోల్డ్ చైన్ విశ్వసనీయత అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ ఇవి సురక్షితం
ప్యాకెట్ ఓపెన్ చేసిన తరువాత 24-48 గంటల్లోపు వాడాలి. ఆ తర్వాత బ్యాక్టీరియా పెరుగుదల రేటు వేగవంతం అవుతుంది.
అలాగే కలుషితమైన పాలను మరిగించకుండా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, ఉబ్బరం లేదా ఫుడ్ పాయిజనింగ్ వంటి జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పాలు కల్తీ అయ్యాయో లేదో గుర్తించే చిట్కాలు
నీరు: ఒక చుక్క పాలు నునుపైన వంపుతిరిగిన ఉపరితలంపై ఉంచితే, స్వచ్ఛ మైన పాలు తెల్లగా మందంగా పారతాయి. అవే నీళ్లు కలిపినవైతే పలుచగా త్వరగా జారిపోతాయి.
క్రీమ్ పరీక్ష: పాలను మరిగించి, చల్లబరచండి. దాని పైన క్రీమ్ పొర ఏర్పడకపోతే, పాలు పలుచబడినట్లు అర్థం.
నురుగు పరీక్ష: పాలను ఒక సీసాలో నిల్వ చేసి, ఆపై దానిని కదిలించండి. చాలా నురుగు ఏర్పడితే, అది డిటర్జెంట్ కాలుష్యంతో ముడిపడి ఉండవచ్చు.
కలుషితమైన పాలు, పరిశుభ్రత లేకపోవడం లేదా సురక్షిత నిర్వహణ లేమితో E.coli, Salmonella, Listeria, coliform లాంటి హానికరమైన బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయి.


