ఇటు ఏఐసీసీ, అటు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ
అధికారంలో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి నేతను పంపిస్తారంటున్న ఢిల్లీ వర్గాలు
రాష్ట్ర రాజకీయ పరిస్థితులలో ఇమడలేనని హైకమాండ్‌కు స్పష్టంచేసిన మేడమ్
మీనాక్షిని మారిస్తే మాజీ సీఎంలు భూపేశ్ బఘేల్, అశోక్ గెహ్లాట్, హరీశ్ రావత్‌లో ఒకరికి చాన్స్?
ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మార్చే అవకాశం!
కొత్త ఏడాదిలో తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ త్వరలోనే మారుతున్నారా? పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణకు బడా నేతను ఇన్‌చార్జిగా పంపాలనే యోచనలో హైకమాండ్ ఉందా? 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులను అనుకూలంగా మార్చే రాజకీయ వ్యూహకర్తల అన్వేషణలో ఢిల్లీ పెద్దలున్నారా? పార్టీ వ్యవహారాలపై పట్టు బిగించాలంటే అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్ లాంటి ఉద్ధండులు అవసరమవుతారనే భావనలో వారున్నారా? కొత్త ఏడాదిలో జరిగే ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పు జరగబోతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్న ఇబ్బందులు, ప్రొటోకాల్ సమస్య, ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను సమన్వయపర్చాల్సిన అవసరం వెరసి మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మార్చనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవమున్న అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, హరీశ్ రావత్‌లలో ఒకరు తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ కూడా వినిపిస్తోంది. దీనికితోడు రాష్ట్రంలో నెలకొన్న పార్టీ పరిస్థితుల నేపథ్యంలో తాను ఇమడలేననే అభిప్రాయాన్ని మీనాక్షి ఢిల్లీ పెద్దల ముందుంచారని సమాచారం.
మేడమ్ సమ్మతిమేరకేనా..?
అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకునే తనను ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ హైకమాండ్‌ను మీనాక్షి కోరినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం కొన్ని కఠిన, కీలక నిర్ణయాలు అమలు చేయాలని భావించినా, క్షేత్రస్థాయిలో అందుకు అనుగుణంగా లేని పరిస్థితులు, నేతల నుంచి కొరవడిన సహకారం నేపథ్యంలో ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకునేందుకే ఆమె మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.
ఫైర్‌బ్రాండ్‌గా ఎంట్రీ దొరికినా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టిన మీనాక్షి తొలి నుంచి పార్టీపై తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేశారు. పార్టీ విషయంలో అత్యంత నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరును ఆమె వచ్చీ రావడంతోనే తెచ్చుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి గల కారణాలను విశ్లేíÙంచారు. రాష్ట్ర, క్షేత్రస్థాయి నాయకత్వానికి మధ్య విపరీతమైన గ్యాప్ ఉందని గుర్తించి దానిని చక్కదిద్దే పని మొదలుపెట్టారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పాత కేడర్‌కు ప్రాధాన్యత, వరంగల్ జిల్లా, పఠాన్‌చెరు నియోజకవర్గాల కొట్లాట లాంటి వ్యవహారాల్లో రాష్ట్ర పార్టీ అవలంబించిన విధానాలు ఆమె అసంతృప్తికి కారణమయ్యాయనే చర్చ జరుగుతోంది. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు బయటపడటం, ఈ వ్యవహారంలో కనీసం మందలింపు కూడా లేకుండా సులువుగా సమస్యను పరిష్కరించామనే భావనను కలిగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు వ్యవహరించిన తీరు పార్టీ కేడర్‌లో తన పట్ల ఉన్న గౌరవాన్ని పోగొట్టాయనే అభిప్రాయంతో ఆమె ఉన్నట్టు సమాచారం.
దీన్ని చక్కదిద్ది కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందామని భావించినా, రాష్ట్ర నేతల్లో కొందరు ఒకవైపు, మరికొందరు ఇంకోవైపు ఉండటంతో ఆమె ఎలాంటి నిర్ణయాలు అమలు చేయలేకపోయారు. పార్టీ పదవుల నియామకంలో తానొకటి తలిస్తే రాష్ట్ర నేతలు మరొకటి అవలంబించడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఫైర్‌బ్రాండ్‌గా ఎంట్రీ దొరికినా ఏడాది తర్వాత అసలు తానున్నానో లేనో అనే భావన పార్టీ కేడర్‌లో వచ్చిందని, తనను తెలంగాణకు పంపిన ఉద్దేశం నెరవేరనప్పుడు ఎక్కువ కాలం ఆ బాధ్యతలు నిర్వర్తించడం మంచిది కాదనే అభిప్రాయంతోనే ఆమె తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు ఏఐసీసీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అధికారంలో ఉన్న చోట ఈజీ కాదనే...
పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వంతో సమన్వయం చేయడం అంత ఈజీ పనికాదని ఏఐసీసీ పెద్దలు సైతం గ్రహించినట్లు ఢిల్లీ వర్గాలంటున్నాయి. గతంలోనూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రులను ఇంచార్జులుగా పంపేవారు., దిగి్వజయ్‌సింగ్, గులాం నబీ ఆజాద్ తదితరులు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరచే విషయంలో చాలా కీలకంగా వ్యవహరించే వారు. పార్టీపై పట్టుపోకుండా ముందుకు నడిపించే వారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేపథ్యంలో వీరికి ప్రొటోకాల్ సమస్య కూడా ఉండేది కాదు. కానీ పార్టీ పరంగా పెద్ద హోదాలో ఉన్న మీనాక్షికి, ప్రభుత్వంలోని పెద్దలకు నడుమ ప్రొటోకాల్ సమస్య కూడా తలెత్తుతోంది.
ఆ ముగ్గురిలో ఎవరు?
మీనాక్షి స్థానంలో మాజీ సీఎంలు భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), అశోక్ గెహ్లాట్ (రాజస్తాన్), హరీశ్ రావత్ (ఉత్తరాఖండ్)లో ఒకరిని తెలంగాణకు కొత్త ఇన్‌చార్జిగా పంపిస్తారనే చర్చ జరుగుతోంది. ఇందులో బఘేల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నా.. ఆయన ప్రస్తుతం పంజాబ్ బాధ్యతలు చూస్తున్నారు. ఆ రాష్ట్ర యూనిట్‌లో అంతర్గత కలహాలు అదుపులోకి వచ్చేలా, ఎన్నికలకు ముందే వ్యూహాలను అమలు చేసే బాధ్యతలు ఆయ నపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో బఘేల్‌కు రాష్ట్ర బాధ్యతల అప్పగింతపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. రాజస్తాన్‌లో యువనేత సచిన్ పైలట్ ను హైలైట్ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను అక్కడి నుంచి పూర్తిగా వేరుచేయాలని భావిస్తోంది.
ఆయనను తెలంగాణకు పంపితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మీనాక్షిని మహారాష్ట్రకు ఇన్‌చార్జిగా పంపే అవకాశాలున్నాయని అంటున్నారు. వీటన్నింటిపై కొత్త ఏడాదిలోనే నిర్ణయాలు ఉంటాయని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మీనాక్షి మార్పుపై రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేత ఒకరిని ‘సాక్షి’ ప్రశ్నించగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని ఇన్‌చార్జిగా పంపుతారనే చర్చ కొంతకాలంగా ఉందని, అయితే ఇప్పట్లో మీనాక్షిని మారుస్తారని తాను అనుకోవడం లేదని చెప్పడం గమనార్హం.


