
విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా స్వతంత్రంగా ఉండి, స్థిరమైన ఆదాయం కలిగిన జీవిత భాగస్వామికి భరణం ఇవ్వజాలమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. శాశ్వత భరణం సామాజిక న్యాయం కోసం ఉద్దేశించినదే తప్ప, ఆర్థికంగా సమర్థులైన ఇద్దరు వ్యక్తుల మధ్య సంపదను సమానం చేయడానికి కాదని సష్టం చేసింది.
భరణం కోరే వ్యక్తికి తనకు నిజంగా ఆర్థిక సాయం అవసరమని నిరూపించాల్సిన బాధ్యత ఉందని నొక్కి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌ల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఓ జంట విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు క్రూరత్వం ఆధారంగా విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం, భార్యకు శాశ్వత భరణం ఇచ్చేందుకు నిరాకరించడం సరైందేనని స్పష్టం చేసింది.
2010 జనవరిలో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట 14 నెలల్లోనే విడిపోయింది. భర్త లాయర్ కాగా, భార్య రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) గ్రూప్ ’ఎ’అధికారి. భార్య తనను మానసికంగా, శారీరకంగా హింసించిందని, దూషణ పదజాలం వాడిందని, అవమానకరమైన మెసేజ్‌లు పంపిందని, వైవాహిక హక్కులను నిరాకరించిందని, వత్తిపరమైన, సామాజిక వర్గాల్లో తనను అవమానించిందని భర్త ఆరోపించారు.
ఈ ఆరోపణలను భార్య ఖండించింది, భర్తే తనను హింసించాడంటూ ప్రత్యారోపణలు చేసింది. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు, భర్త ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలడంతో విడాకులు మంజూరు చేసింది. అంతేకాకుండా, రూ.50 లక్షలిస్తేనే విడాకులకు ఒప్పుకున్నానంటూ భార్య డిమాండ్ చేయడాన్ని గుర్తించిన ఫ్యామిలీ కోర్టు భరణం అభ్యర్థనను తిరస్కరించింది.
ఉన్నది ప్రేమ కాదు.. ఆర్థిక ప్రయోజనాలే..
ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. పరిశీలించిన ధర్మాసనం, కింది కోర్టు తీర్పులో తప్పులేదని అభిప్రాయపడింది. ’విడాకులను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రేమ, ఆప్యాయతతో కాదని, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. భార్య వైఖరిలో స్పష్టమైన ఆర్థిక కోణం ఉందని ఫ్యామిలీ కోర్టు తేల్చడం సమంజసమే’అని ధర్మాసనం పేర్కొంది.