జరిమానా నిబంధనలపై హైకోర్టులో సవాల్‌ | Apple Challenges Indian Antitrust Law Linking Fines To Global Turnover, Delhi HC To Hear Case On Dec 3 | Sakshi
Sakshi News home page

జరిమానా నిబంధనలపై హైకోర్టులో సవాల్‌

Nov 27 2025 3:58 PM | Updated on Nov 27 2025 5:09 PM

Apple filed petition Delhi High Court challenging antitrust penalty regime

యాపిల్ ఇంక్ తన ప్రపంచవ్యాప్త టర్నోవర్ జరిమానాలను లింక్ చేసే భారతీయ యాంటీ-ట్రస్ట్ చట్టం నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేసింది. ఈ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ) ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వాదిస్తుంది. ఈ రిట్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 3న విచారణ చేపట్టనుంది.

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్. భారతీయ పోటీ చట్టం (Competition Act)లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఉల్లంఘనకు పాల్పడిన సంస్థలపై విధించే జరిమానాలను వారి ప్రపంచ టర్నోవర్‌తో అనుసంధానించే నిబంధనల రాజ్యాంగబద్ధతను కంపెనీ ప్రశ్నించింది.

అసలు సమస్య ఏమిటి?

యాపిల్ తన రిట్ పిటిషన్‌లో కాంపిటీషన్ చట్టంలోని సవరించిన సెక్షన్ 27(బి), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) 2024 నాటి టర్నోవర్ నిబంధనలను ప్రధానంగా సవాల్ చేసింది. పోటీ చట్టంలో సవరించిన నిబంధనల ప్రకారం.. పెనాల్టీల సమయంలో కంపెనీ ఉత్పత్తులు, సేవల నుంచి పొందిన గ్లోబల్ టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. తద్వారా జరిమానాలకు సంబంధించి ప్రపంచవ్యాప్త ఆదాయాన్ని లెక్కిస్తారు. దాంతో కంపెనీపై ఏదైనా జరిమానా విధించాల్సి వస్తే గ్లోబల్‌ టర్నోవర్‌ను లెక్కించి నిర్ణయం తీసుకుంటారు. ఇది కంపెనీకి నష్టం. యాపిల్ ఈ నిబంధనలను కొట్టివేయాలని కోరుతోంది.

యాపిల్ న్యాయపరమైన సవాల్‌ 2022లో ప్రారంభమైన యాంటీట్రస్ట్ దర్యాప్తుతో ముడిపడి ఉంది. టిండర్ యజమాని మ్యాచ్ గ్రూప్, కొన్ని భారతీయ స్టార్టప్‌ల ఫిర్యాదుల మేరకు సీసీఐ దర్యాప్తును ప్రారంభించింది. థర్డ్‌ పార్టీ చెల్లింపులను పరిమితం చేస్తున్నట్లు సీసీఐ ప్రాథమికంగా కనుగొంది. ఇన్-యాప్ లావాదేవీలపై 30 శాతం వరకు అధిక కమీషన్లు తీసుకుంటున్నట్లు గమనించింది. దీని ద్వారా ఐఓఎస్ యాప్ స్టోర్‌లో యాపిల్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీసీఐకి ఆధారాలు లభించాయి.

అయితే, యాపిల్ ఎలాంటి తప్పు చేయలేదని ఖండించింది. తాము న్యాయమైన, సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఒకవేళ ఈ కేసులో సీసీఐ మరిన్ని ఆధారాలు సేకరిస్తే యాపిల్‌ జరిమానా విధించాల్సి వస్తుంది. సీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఆర్థిక సంవత్సరాల్లో దాని సగటు ప్రపంచ టర్నోవర్‌లో 10 శాతం జరిమానా విధించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది సుమారు 38 బిలియన్ డాలర్లగా ఉంటుందని చెబుతున్నారు.

యాపిల్ సంస్థ వైఖరి

యాపిల్ తన పిటిషన్‌లో కొన్ని కీలక వాదనలను ముందుకు తెచ్చింది. జరిమానాలను గ్లోబల్ టర్నోవర్‌తో లింక్ చేయడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ) కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నట్టేనని యాపిల్ వాదిస్తోంది. ఇది ఏకపక్షం, అసమానమైనది అని పేర్కొంది. సంస్థ మొత్తం గ్లోబల్ ఆదాయాన్ని పరిగణిస్తూ కేవలం ఒక నిర్దిష్ట మార్కెట్‌లో లేదా కొన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఉల్లంఘనకు జరిమానా విధించడం న్యాయం కాదని వివరించింది. యూకే, యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ యాంటీ ట్రస్ట్ నిబంధనలు కూడా ఉల్లంఘన జరిగిన నిర్దిష్ట భౌగోళిక మార్కెట్లో సంబంధిత టర్నోవర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయని కంపెనీ తెలిపింది.

డిసెంబర్‌ 3న విచారణ

ఇంటర్‌లిక్డ్‌ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించిన సీసీఐ ‘కాన్ఫిడెన్షియాలిటీ రింగ్’ ఉత్తర్వులోని కొన్ని అంశాలను కూడా యాపిల్ రద్దు చేయాలని కోరింది. యాపిల్ తన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో సీసీఐలో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని కోర్టును కోరింది. మరిన్ని వివరాల కోసం డిసెంబర్ 3న ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టనుంది.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement