అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేయడంలో విఫలమైనందుకు గాను టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూ. 150 కోట్ల జరిమానా విధించింది. నెలకు రూ. 50 లక్షల వరకు పెనాల్టీలతో 2020 నుంచి మూడేళ్ల వ్యవధికి గాను ఈ మొత్తాన్ని కట్టాలని ఆదేశించింది.
కస్టమర్ల ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకపోవడం, నిబంధనలకు తగ్గట్లుగా స్పామర్లపై తగిన చర్యలు తీసుకోకపోవడంలాంటి ఆరోపణలు ఇందుకు కారణం. అయితే, ఈ జరిమానాను టెల్కోలు సవాలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాయ్ గతేడాది 21 లక్షల స్పామ్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేయడంతో పాటు 1 లక్ష పైగా ఎంటిటీలను (సంస్థలు, వ్యక్తులు) బ్లాక్‌లిస్టులో పెట్టింది.
4–6 క్లిక్‌లతో కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు వీలుగా ట్రాయ్ డీఎన్‌డీ యాప్ అందుబాటులో ఉంది. కాల్స్ లేదా మెసేజీలు వచ్చిన 7 రోజుల వరకు ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా ప్రభుత్వ విభాగాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగాల కంపెనీలు లావాదేవీలు..సర్వీసులపరమైన కాల్స్ చేసేందుకు 1600 సిరీస్‌తో మొదలయ్యే నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.
10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ చేయకూడదు. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లకు కఠినతరమైన నిబంధనలు అమలవుతున్నప్పటికీ, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోని వ్యక్తుల.. 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజీలు అత్యధికంగా వస్తున్నాయి.


