సాక్షి శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్లో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 16 రోజుల్లోనే రూ.92 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే ఈ సీజన్ తొలి 16 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం.
గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగినట్లు టీడీబీ పేర్కొంది. అయితే గతేడాది కేవలం రూ.69 కోట్లు మాత్రమే వసూలైనట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచే వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు దాదాపు రూ.47 కోట్లు ప్రసాదాల విక్రయాల ద్వారే సమకూరినట్లు బోర్డు వివరించింది.
ఇక మండల-మకరవిలక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు(16 రోజుల తర్వాత) సుమారు పదమూడున్నర లక్షల మందికి పైగా భక్తుల అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. శని, ఆదివారాల్లో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ..సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది.
సోమవారం గురుపవనపురి ఏకాదశి సందర్భం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 90 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అలాగే కేరళ అన్నదాన సద్య పథకం నేడు ప్రారంభం కాదని దేవస్వం బోర్డు తెలిపింది. కాగా, పంపా నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో 12 ప్రదేశాల్లో తాగునీరు, స్నాక్స్, అత్యవసర ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు.
(చదవండి: శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!)


