ఏపీలో బాబు హయాంలో పడిపోయిన ప్రత్యక్ష పన్నుల రాబడి
రాష్ట్రం నుంచి 2023–24లో కేంద్రానికి ఈ రాబడి రూ.26,066 కోట్లు
అదే 2024–25లో రూ.23,804 కోట్లే..
అనేక రాష్ట్రాల్లో పురోగమనం.. ఇక్కడ మాత్రం తిరోగమనం
అమ్మకం పన్ను రాబడీ పడిపోతోంది
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోయింది. 2023–24 ఆర్థిక ఏడాది కన్నా 2024–25లో రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. బిహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి 2023–24 ఆరి్థక ఏడాది కన్నా 2024–25లో ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం పెరిగింది.
కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పడిపోయింది. ఈ విషయాన్ని సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 2023–24లో ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి రూ.26,066 కోట్లు రాబడి వస్తే 2024–25లో అది రూ.23,804 కోట్లకు పడిపోయింది. అంటే.. రూ.2,262 కోట్ల రాబడి తగ్గిపోయింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోవడంవల్లే పన్ను రూపంలో కేంద్రానికి ఏపీ నుంచి రాబడి తగ్గిపోయిందని స్పష్టమవుతోంది.

నెలనెలా తగ్గుతున్న అమ్మకం పన్ను రాబడులు..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపటి్టనప్పటి నుంచి రాష్ట్ర అమ్మకం పన్ను రాబడులు అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే ప్రతీనెలా తగ్గుతున్నాయని కాగ్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వల్లే అమ్మకం పన్ను రాబడి తగ్గిపోతోంది. ఎన్నికల ముందు ప్రజలిచ్చిన హామీలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను అమలుచేయకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది.


