ఈ హత్య కేసులో ఆమె బాధితురాలు కానేకాదు
ఆమె, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు
కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు
సునీత పిటిషన్‌పై ప్రతివాదుల వాదనలు
తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో పరిస్థితులను పరిశీలిస్తే ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతపైనే అనుమానం వస్తోందని న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు చెప్పారు. ఈ కేసులో కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి యథేచ్ఛగా తిరుగుతుంటే.. నిందారోపణలు భరిస్తున్నవారు మాత్రం కుటుంబాలకు దూరంగా బతకాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నర్రెడ్డి సునీత బాధితురాలు కాదని.. ఆమె, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై కూడా అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ నర్రెడ్డి సునీత సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయాధికారి టి.రాఘురామ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ఆరి్థక విభేదాలు, కుటుంబ వివాదాలు, వివేకా మరో పెళ్లితో పరువు పోతోందన్న గొడవ, ఆస్తిని రెండో భార్యకు, ఆమెకు కుమారుడికి రాసిస్తారన్న కోపం, ఆయన్ని ఏకాకిని చేయడం, తిండిపెట్టే దిక్కు లేకపోవడం, తండ్రిని గొడ్డలితో నరికానని చెప్పిన కిరాయి నరహంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరించడం, అతడి బెయిల్‌ను వ్యతిరేకించకపోవడం, అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నా మిన్నకుండటం.. ఇవన్నీ గమనిస్తే కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్లకు కూడా సునీతపై అనుమానం వస్తుందని చెప్పారు. కానీ సీబీఐ ఆ దిశగా విచారణ జరపలేదన్నారు. ఆమె చెప్పిన మేరకు నిరాధార నిందలు మోపి మరికొందరిని నిందితులుగా చేర్చేలా దర్యాప్తు మరింత లోతుగా చేసేలా ఆదేశించాలని పిటిషన్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అనంతరం విచారణను న్యాయస్థానం నేటికి (మంగళవారానికి) వాయిదా వేసింది.
కుటుంబాలకు దూరంగా ఎన్నాళ్లు..
‘కరుడుగట్టిన కిరాయి నరహంతకుడు దస్తగిరి స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంటే.. నిందమోపబడిన వారు స్వగ్రామానికి దూరంగా హైదరాబాద్‌లో ఉంటూ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. వివేకా హత్య జరిగి వచ్చే మార్చికి ఏడేళ్లు. ఈ కేసు ఇంకా ఎన్నాళ్లు కొనసాగాలి. 2023 వరకల్లా సీబీఐ చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసింది. 2025 జనవరి వరకు సత్వర విచారణ కోరిన సునీత యూటర్న్ తీసుకుని ఇప్పుడిలా పిటిషన్ వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కేసు పూర్తిగాకుండా చూడాలన్న వైఎస్సార్‌సీపీ వ్యతిరేకుల కుయుక్తిలో ఆమె కూడా చేరారు.
అందుకే ఆగమేఘాల మీద తన నిర్ణయాన్ని మార్చుకుని దర్యాప్తు కొనసాగించాలని పిటిషన్ వేశారు తప్ప.. మరో కారణం లేదు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఇద్దరూ వయోవృద్ధులు. విచారణ జరిపి వారు నిర్దోషులని నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉంది’ అని ఉమామహేశ్వరరావు తన వాదనల్లో పేర్కొన్నారు.
హైకోర్టుల్లోని పిటిషన్లు దాచిపెట్టి..
‘కొత్తగా సాక్షులు వచ్చినా, డాక్యుమెంట్ ఆధారాలు లభించినా.. పిటిషన్ వేయడంలో అర్థముంది. కానీ ఇక్కడ కొత్తగా ఎలాంటి ఆధారం దొరకలేదు. విచిత్రంగా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కూడా తప్పుగా ఉందని, మార్చాల్సిందేనని ఆమె పట్టుబడుతుండటం విడ్డూరం. ఇలా ఆమె కోరిన వాటన్నింటికి కోర్టుకు అంగీకరిస్తే.. ఏళ్లకు ఏళ్లు గడిచినా ట్రయల్ కూడా ప్రారంభంకాదు. రోజువారీ విచారణ కోరుతూ హైకోర్టులో ఆమె వేసిన పిటిషన్‌ను ధర్మాసనం అనుమతిస్తే.. ఈ కోర్టు తదుపరి దర్యాప్తునకు అనుమతి ఇచ్చినా నిష్ప్రయోజనం. సునీల్‌యాదవ్ తనకు రూ.కోటి ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.
అందులో చాలా మొత్తం సీబీఐ రికవరీ చేయలేదు. అది రికవరీ చేయాలని మేం వాదనలు వినిపిస్తున్నాం. కానీ సునీత దాన్ని పట్టించుకోరు. చైతన్యరెడ్డి.. దస్తగిరిని బెదిరించాడన్న అంశాన్ని ఆమె పేర్కొన్నారు. ఆ అంశంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఏపీ హైకోర్టు దర్యాప్తు నిలిపేస్తూ ఆదేశాలిచి్చంది. వీటితోపాటు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను దాచిపెట్టి ఈ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదు. కొట్టివేయండి’ అని ఉమామహేశ్వర్‌రావు వాదించారు.


