గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్‌లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్‌ను బట్టి లెక్కించినదిగా అనుకోండి.
కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే..
ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్‌కంట్యాక్స్ పడదు.
కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే..
సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం.
ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..
A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000
B. వ్యవసాయ ఆదాయం, బేసిక్ లిమిట్ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000
ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.
ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..
మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి.
రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది.
అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి.
ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)
బేసిక్ లిమిట్‌కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)
చెల్లించాల్సిన పన్ను (5) – (6)
దీనికి విద్యా సుంకం అదనం
రూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.
బేసిక్ లిమిట్‌కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది.
పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.
రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది. వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది.
మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.
కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్ ఇంటిగ్రేషన్ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.
అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.
పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి.
ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్ ప్లానింగ్ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక.


