
భారత క్రికెట్ జట్టును టీమిండియా (Team India) అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఓ ప్రైవేట్ సంస్థ (BCCI) ఎంపిక చేసే జట్టును భారత జట్టు లేదా టీమిండియా అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ (PIL) దాఖలు చేశారు.
బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ఇండియా లేదా భారత్ పేరును వాడుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా చేసి జాతీయ గుర్తింపు పొందడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
సమాచార హక్కు చట్టం (RTI) ఆధారంగా బీసీసీఐకి ప్రభుత్వ గుర్తింపు లేదా నిధులు లేవని పేర్కొన్నారు. జాతీయ చిహ్నాలు, జెండా, పేరు వాడకం ద్వారా 1950 చట్టం, 2002 ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రసార్ భారతి వంటి జాతీయ ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును ‘టీమిండియా’ పేరుతో ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తిప్పికొట్టింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలా ఈ పిటిషన్‌ను కోర్టు సమయాన్ని వృథా చేసే చర్యగా అభివర్ణించారు.
ఈ జట్టు విశ్వ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. అలాంటప్పుడు టీమిండియా లేదా భారత జట్టని ఎందుకు పిలవకూడదని న్యాయమూర్తి తుషార్ గెడెలా పిటిషనర్‌ను ప్రశ్నించారు.
క్రీడా జట్లను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేస్తారా..? కామన్‌వెల్త్, ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లను ప్రభుత్వమే ఎంపిక చేస్తుందా అని ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ప్రశ్నించారు. మీ ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయడం నిషేధమా అని నిలదీశారు.
దేశ పేరు, జాతీయ చిహ్నాల వాడకం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. క్రీడా వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ప్రమాదకరమని హెచ్చరించారు. దేశానికి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలని అక్షింతలు వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు అర్హం కాదని కొట్టి పారేశారు.
ఈ తీర్పుతో టీమిండియా అనే పేరు చట్టబద్ధంగా కొనసాగించవచ్చని, బీసీసీఐ జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు