IND Vs SA: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు | CWC 2025, IND VS SA: Most Runs Scored After The Fall Of 5th Wickets In A Successful Chase, Check Out Highlights | Sakshi
Sakshi News home page

IND Vs SA: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు

Oct 10 2025 8:28 AM | Updated on Oct 10 2025 11:26 AM

CWC 2025, IND VS SA: Most runs scored after the fall of 5th wickets in a successful chase

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భాగంగా నిన్న (అక్టోబర్‌ 9) ఓ ఆసక్తికర పోరు జరిగింది. భారత్‌, సౌతాఫ్రికా జట్లు వైజాగ్‌ వేదికగా హోరాహోరీగా తలపడ్డాయి. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు నదినే డి క్లెర్క్‌ (Nadine de Klerk) (54 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.  

భారత్‌ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్‌.. క్లో ట్రయాన్‌ (49) సహ​కారంతో సౌతాఫ్రికాను గెలిపించింది. లక్ష్యానికి కొద్ది దూరంలో (41 పరుగులు) ట్రయాన్‌ ఔట్‌ కాగా.. చివర్లో క్లెర్క్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. 

చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉండి, 24 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది.

క్లెర్క్‌ సంచలన ఇన్నింగ్స్‌ కారణంగా సౌతాఫ్రికా ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. వన్డే క్రికెట్‌ చరిత్రలో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో, ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్రకె​క్కింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదో వికెట్‌ పడిన తర్వాత 171 పరుగులు జోడించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్‌ (159) పేరిట ఉండేది.

సౌతాఫ్రికా హ్యాట్రిక్‌
ఈ గెలుపుతో సౌతాఫ్రికా హ్యాట్రిక్‌ సాధించింది. ప్రపంచకప్‌ టోర్నీల్లో సౌతాఫ్రికాకు భారత్‌పై ఇది వరుసగా మూడో విజయం. ఈ గెలుపుకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. వన్డేల్లో భారత్‌ చేతిలో వరుసగా ఐదు ఓటముల తర్వాత సౌతాఫ్రికాకు లభించిన తొలి విజయం ఇది.

రిచా ఘోష్‌ చారిత్రక ఇన్నింగ్స్‌
ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి, రిచా ఘోష్‌ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్‌ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్‌ రాణా (33) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది తొలి ఓటమి. అంతకుముందు భారత్‌ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌లపై విజయాలు సాధించింది.

చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement