breaking news
estranged wife
-
వేరుపడిన భార్య వస్తువుల్ని 24 గంటల్లోగా అప్పగించాలి
న్యూడిల్లీ: వేరుగా ఉంటున్న భార్యను ఆమె దుస్తులు, ఇతర వస్తువుల్ని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్న ఓ భర్తపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమని పేర్కొంది. ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులను 24 గంటల్లోగా అప్పగించాలని అతడిని ఆదేశించింది. దీపావళి పండుగ జరుపుకునేందుకు తన కుమారుడిని తనతో ఇంటికి పంపించేలా భార్యను ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఆమె కుమారుడిని భర్తతో పంపేందుకు నిరాకరించింది.2022 నుంచి అత్తింట్లో ఉన్న తన వస్తువులను అతడు తీసుకెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది. స్పందించిన ధర్మాసనం ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించింది. ‘వివాహాలు కొన్ని విఫలమవుతుంటాయి. కానీ, భార్య తన దుస్తులు తీసుకోవడానికి కూడా భర్త అనుమతించనంత స్థాయికి దిగజారకూడదు. కలిసి ఉండలేని పరిస్థితి వేరు. ఆమె వస్తువులను 24 గంటల్లో తిరిగి అప్పగించాలని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా, తల్లి, తండ్రి కలిసి తమ కుమారుడిని దగ్గర్లోని గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలని, కావాలనుకుంటే అమ్మమ్మ, తాతయ్యలు కూడా వారితో వెళ్లవచ్చని ధర్మాసనం పేర్కొంది. -
కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు!
విజయవాడ: విభేదాలతో వేరుగా ఉంటున్న తన భార్యకు నెలకు రూ. 8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ సెక్షన్ 498 ఏ గృహహింస చట్టం కింద ఆయన భార్య శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత జనవరి నుంచి ఈ కేసును విజయవాడ ఫ్యామిలీ కోర్టు విచారణ నడుస్తున్నప్పటికీ, ఎన్నడూ పృథ్వీరాజ్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. పృథ్వీరాజ్, శ్రీలక్ష్మికి 1984లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పృథ్వీరాజ్ కుటుంబం మొదట విజయవాడలో నివసించేంది. పృథ్వీరాజ్ కు సినిమాల్లో బ్రేక్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబం హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో భారీ డిమాండ్ ఉన్న కమెడియన్లలో పృథ్వీరాజ్ ఒకరు. ముఖ్యంగా ’ఖడ్గం’ సినిమాలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో పృథ్వీరాజ్ లైమ్‌లైటులోకి వచ్చారు. ఇటీవలికాలంలో పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ.. మనసిక క్షోభకు గురిచేస్తున్నారని, ఇక ఆయనతో కలిసి ఉండటం తనకు సాధ్యం కాదని శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. భర్త ఆదాయ వివరాలను కోర్టుకు సమర్పించిన ఆమె.. తనకు నెల రూ. 10 లక్షల భరణం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. అయితే, పృథ్వీరాజ్ ఆదాయ మార్గాలను పరిశీలించిన కోర్టు నెలకు రూ. 8 లక్షలు భరణం చెల్లించాలని గురువారం ఆదేశాలు జారీచేసింది.


