
పంజాబ్‌లో వ్యర్థాల దహనం వల్లే: రాష్ట్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మంగళవారం నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్ విభాగంలో చేరిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) తెలిపింది. ఇది గతంలో 2024లో 330, 2023లో 218, 2022లో 312, 2021లో 382గా నమోదైందని సీపీసీబీ గుర్తు చేసింది. పండుగ రోజు, సోమవారం రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే, జనం ఆ పరిమితిని పట్టించుకోలేదు.
అర్ధరాత్రి వరకు మోతమోగించారు. సోమవారం రాత్రి కాలుష్య కారక సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)స్థాయిలు 675కు చేరాయని సీపీసీబీ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీపై దట్టమైన బూడిదరంగు మంచు మేఘాలు కమ్ముకున్నాయి. వాయు నాణ్యత రెడ్ జోన్ స్థాయికి చేరుకుంది. వీటన్నిటికీ పంజాబ్ రైతుల పంటవ్యర్థాల దహనమే కారణమని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం నిషేధాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపింది. ఢిల్లీలో దీపావళికి ముందు ఏక్యూఐ 345 ఉండగా, మంగళవారం ఉదయం కేవలం 11 పాయింట్లు పెరిగి 356కి చేరుకుందని పేర్కొంది.