
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో మోదీకి తనకు మధ్య ఫోన్ సంభాషణేదీ జరగలేదన్న భారత విదేశాంగ శాఖ ప్రకటనపైనా ఆయన స్పందించారు.
ఆదివారం రాత్రి కొందరు రిపోర్టర్ల నుంచి ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. ‘‘ఆయన(మోదీ) రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని నాతో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే భారీ సుంకాలను ఆ దేశం ఎదుర్కొనక తప్పదు’’ అని ట్రంప్ హెచ్చరించారు(Trump On India Russia Oil Trade). ఆ సమయంలో..
‘‘ప్రధాని మోదీ మీకు మధ్య ఇటీవలి ఫోన్ సంభాషణ జరిగిందన్న తమకు తెలియదని భారత ప్రభుత్వం చెబుతోంది కదా’’ అని ఓ రిపోర్టర్ ట్రంప్ వద్ద ప్రస్తావించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, వాళ్లు అలా చేయాలనుకోరని నేను అనుకుంటున్నా’(Trump Warn India) అని బదులిచ్చారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేసిందని, రాబోయే రోజుల్లో పూర్తిగా ఆపేస్తుందని, ఈ మేరకు తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించిందని ట్రంప్ గత బుధవారం తన ఓవెల్ ఆఫీస్‌లో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ ఇద్దరు నేతల మధ్య అలాంటి ఫోన్ సంభాషణేది జరగలేదన్న భారత విదేశాంగ శాఖ.. ఎవరి ఒత్తిళ్లు తమపై పని చేయబోవని, దేశ ప్రజల ప్రయోజనాల మేరకే ఎలాంటి నిర్ణయం అయినా ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఆ మరుసటిరోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ..
రష్యా చమురును భారత్ కొనుగోలు చేయబోదని, ఢిల్లీ వర్గాల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, ఉక్రెయిన్ యుద్ధంలో ఇది కీలక అడుగు అని, ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు.
ఇదిలా ఉంటే.. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తోందని.. పైగా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతూ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తోందంటూ ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో సుంకాల యుద్ధానికి దిగారు.
భారత్‌పై జులై 31వ తేదీన 25 శాతం అదనపు సుంకాన్ని(ప్రతీకార సుంకాన్ని) విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ వెంటనే రష్యా చమురు కొనుగోలు నేపథ్యంతో ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించారు. అలా.. ఆగష్టు 27వ తేదీ నుంచి భారత్‌పై అమెరికా వివధించిన 50 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలను భారత్ అన్యాయంగా పేర్కొంటూనే.. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ ఎలా స్పందిస్తుంది.. ఈ ప్రభావం ట్రేడ్ డీల్‌పై పడుతుందా? అనేది చూడాలి(Trump Massive Tariff Warn To India).
ఇదీ చదవండి: ట్రంప్‌ది ముమ్మాటికీ నిరంకుశ పాలనే!