
అధ్యక్షుడికి వ్యతిరేకంగా అమెరికాలో వెల్లువెత్తిన నిరసనలు
నిరంకుశ పాలన వద్దంటూ నినాదాలు
దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు, ర్యాలీలు
అసలైన ప్రజాస్వామ్యం కావాలని జనం డిమాండ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జనం తిరుగుబాటు ప్రారంభించారు. ‘నో కింగ్స్’ పేరిట శనివారం దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ట్రంప్ రాజు కాదని, ఇక్కడ రాజులెవరూ లేరని, నిరంకుశ పరిపాలన ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దేశాన్ని నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు.
నియంతృత్వ పరిపాలనను ప్రతిఘటించడం, నిరసన తెలపడమే అసలైన దేశభక్తి అని ప్రజలు తేల్చిచెప్పారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌తోపాటు బోస్టన్, అట్లాంటా, షికాగో తదితర నగరాల్లో నిరసనకారులు కదం తొక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్ సహా వివిధ నగరాల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. గాలితో నింపిన దుస్తుల్లాంటివి ధరించారు. అమెరికా రాజ్యాంగ ప్రవేశికను ముద్రించిన బ్యానర్లపై సంతకాలు చేశారు. తాము ముమ్మాటికీ అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు.
నియంతగా మారుతున్న ట్రంప్
నిరసన ప్రదర్శనలపై అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అవన్నీ ‘అమెరికాను ద్వేషించే’ ర్యాలీలు అంటూ ఆరోపించింది. ట్రంప్ మద్దతుదారులు సైతం ఈ ర్యాలీలను తప్పుపట్టారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జనం సామూహికంగా నిరసన తెలపడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
కొన్నిరోజుల క్రితం అమెరికాలో షట్‌టౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సేవలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రంప్ నిర్వాకం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వారు మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుపట్టారు. నిరంకుశ అధికారం చెల్లబోదని తేల్చిచెప్పారు. ట్రంప్ విధానాలు తమకు ఎంతమాత్రం నచ్చడం లేదని ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికురాలు షాన్ హోవార్డ్ చెప్పారు. తాను గతంలో ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు.
ట్రంప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ముందుకెళ్తోందని, వలసదారులను అక్రమంగా నిర్బంధించడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించడం సరైంది కాదన్నారు. ఇదంతా ‘అన్–అమెరికన్’ అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ నియంతగా మారిపోతున్నారని మరో నిరసనకారుడు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, నిరసన కార్యక్రమాల విషయంలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలియజేశారు.
జెట్ విమానంలో ‘కింగ్ ట్రంప్’
తనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ‘నో కింగ్స్’ నినాదాన్ని హేళన చేస్తూ కింగ్ ట్రంప్ పేరిట ఒక కృత్రిమ మేధ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో కిరీటం ధరించిన ట్రంప్ జెట్ విమానంలో కూర్చొని దూసుకెళ్తున్నారు. బాంబుల తరహాలో ఈ విమానం బురదను చిమ్ముతోంది. ఆ బురదంతా అమెరికాలో నగరాల్లోని నిరసనకారులను కమ్మేస్తోంది. ట్రంప్ తనను తాను బలమైన రాజుగా పరోక్షంగా ప్రకటించుకున్నారు. నిరసన ర్యాలీలను లెక్కచేయబోనని, బురదతో సన్మానిస్తానని సంకేతాలు పంపించారు.