
ఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త మాటల మర్మమేమిటో తెలుసుకోవాలన్నారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతించాలని.. ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీకి సూచించారు. ఇదే సమయంలో రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు.
భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. భారత్ అనుకూల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ చాలా త్వరగా స్పందించారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నాను. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం.
రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉంది. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేం అని కీలక వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Thiruvananthapuram: On PM Modi's response to US President Donald Trump speaking positively on India-US relationship, Congress MP Shashi Tharoor says, "The Prime Minister was very quick to respond, and the Foreign Minister has also underscored the importance of the basic… pic.twitter.com/Iju3uZUkzl
— ANI (@ANI) September 7, 2025
ఇదిలా ఉండగా.. భారత్‌పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘భారత్‌తో అమెరికాకు ప్రత్యేక బంధం ఉంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది’ అని చెప్పుకొచ్చారు. దీనిపై మోదీ వెంటనే స్పందిస్తూ.. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత-అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్టు పెట్టారు.