డబ్ల్యూహెచ్‌వో కార్యక్రమంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సంప్రదాయ వైద్యానికి సరైన గుర్తింపు ఇప్పటికీ లభించలేదని ప్రధానమంత్రి మోదీ శుక్రవారం అన్నారు. ఈ వైద్య విధానం తన పరిధిని మరింతగా విస్తరించుకోవాలంటే, శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రజల నమ్మకాన్ని గెలవాల్సి ఉందని చెప్పారు. సంప్రదాయ వైద్యంపై శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ప్రధాని ప్రసంగించారు.
డిజిటల్ సాంకేతికతను వాడుకుంటూ పరిశోధనలను మరింతగా విస్తరించుకుంటూ సంప్రదాయ వైద్యం తన పరిధిని పెంచుకోవాలని సూచించారు. లైఫ్‌స్టయిల్ విధానాలకు మాత్రమే సంప్రదాయ వైద్య పరిమితమనే నమ్మకం ఒకప్పుడు ఉండేది. ఈ ఆలోచనాధోరణిలో వేగంగా మార్పువచ్చింది. క్లిష్టమైన సందర్భాల్లో సైతం సంప్రదాయ వైద్య విధానాలు నేడు ప్రభావవంతంగా ఉంటున్నాయి. ఇదే దృక్పథం భారత్‌లోనూ ఉంది’అని ప్రధాని మోదీ చెప్పారు.
‘ఒకప్పుడు ప్రపంచంలోని అత్యధిక ప్రాంతంలో సంప్రదాయ వైద్యానికే పెద్దపీట వేసేవారు. అయినప్పటికీ, దీనికి దక్కాల్సిన స్థానం ఇప్పటికీ దక్కలేదు. సైన్స్ ద్వారా నమ్మకాన్ని పెంచుకోవాలి. మరింతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్లాలి’అని అన్నారు.
భారతీయ సంప్రదాయ వైద్య విధానాల్లో కీలకంగా ఉన్న అశ్వగంధకు కోవిడ్ మహమ్మారి సమయంలో అంతర్జాతీయంగా డిమాండ్ వచ్చిందన్నారు. భారత వైద్య నిపుణులు అమూల్యమైన పరిశోధనలు, సాధించిన ప్రమాణాల ఫలితంగా అశ్వగంధకు సముచిత స్థానం దక్కిందని వివరించారు. ఇలాంటి మూలికలకు ప్రపంచ ఆరోగ్య రంగంలోభాగంగా మారేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రకటించారు.
సంప్రదాయ వైద్యానికి అంగీకార యోగ్యతను కల్పించడం దేశాల బాధ్యతని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మై ఆయుష్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ పోర్టల్(ఎంఏఐఎస్‌పీ)ని ప్రారంభించారు. ఆయుష్ ఉత్పత్తులు, సేవల నాణ్యతను నిర్ధారించే ఆయుష్ మార్క్‌ను ఆవిష్కరించారు. అశ్వగంధపై తపాలా స్టాంపును విడుదల చేశారు. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ప్రతాప్‌రావ్ జాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


