
ఢిల్లీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య వ్యాఖ్య
న్యూఢిల్లీ: శ్రీలంక గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుని తీరతానని శ్రీలంక మహిళా ప్రధాని హరిణి అమరసూర్య వ్యాఖ్యానించారు. ఢిల్లీలో డిగ్రీ చదువుకున్న రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. 1991–94కాలంలో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో సోషియాలజీలో డిగ్రీ చదువుకున్న నేపథ్యంలో గురువారం ఆమె పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘శ్రీలంక నిరంతరం ఒకే నిబంధనకు కట్టుబడి ఉంటుంది. పొరుగున ఉన్న మిత్రదేశం భారత్‌కు ముప్పు వాటిల్లేలా మా భూభాగాన్ని ఎలాంటి భారతవ్యతిరేక కార్యకలాపాలకు నెలవు కానివ్వను.
ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తాం’’అని అన్నారు. తమ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి గత ప్రభుత్వం కూలిపోవడంపై ఆమె మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం అనేది ప్రేక్షకులు ఆస్వాదించే క్రీడ కాదు. అతి నిరంతర అవిశ్రాంత కృషి. అంటే మన సమాజంతో ఎల్లప్పుడూ మమేకం కావాలి. న్యాయం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరూ తమతమ స్థాయిలో అందరి సంక్షేమం కోసం పాటుపడాలి. శ్రీలంక దేశ చరిత్రలో భారత్ శాశ్వత భాగస్వామిగా కీర్తికిరీటం పొందింది. ద్వీపం అయిన మా దేశంలో ఆర్థికసంక్షోభం తలెత్తినప్పుడు భారత్ నిజమైన నేస్తంలా ఆపన్న హస్తం అందించింది’’అని ఆమె అన్నారు.
జయసూర్య తెలుసా?
ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని భారత్, శ్రీలంకలో చూడొచ్చు. నాలాంటి సాధారణ వ్యక్తులను సైతం సమాజంలోని సమస్యలు, విద్యావ్యవస్థ రాటుదేలేలా చేస్తాయి. దేశసేవ చేసే స్థాయికి ఎదగనిస్తాయి. పాక్ జలసంధి కేవలం 22 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే సముద్రం వెంట భారత్, శ్రీలంకలను విడదీస్తోంది. కానీ ఇరుదేశాల నాగరికత, సాంస్కృతి, మత, ప్రాచీన బంధం ఏకంగా 2,000 సంవత్సరాల క్రితమే బలపడింది. ఇప్పుడు క్రికె ట్ సైతం ఈ బంధాన్ని పెనవేస్తోంది. 1991 లో ఇక్కడ డిగ్రీ ఆనర్స్ చదివేందుకు హిందూ కాలేజీలో తొలిసారి అడుగు పెట్టినప్పుడు నా పేరు చెప్పా.
నాది శ్రీలంక అని తెలిసి చాలా మంది ఒక్కటే ప్రశ్న వేశారు. నీకు క్రికెటర్ జయసూర్య తెలుసా?’’అని ఆమె అన గానే పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ అంజూ శ్రీవాస్తవసహా నాటి ఆమె స్నేహితులు పక్కున నవ్వారు. ‘‘భారత్, శ్రీలంకలు ఒకే సంప్రదాయ వారసత్వం, విలువలు, పరస్పర గౌరవాలతో ఎదిగాయి. ఈ సంస్కృతి బంధం పోగులే ఇరు దేశాల సమాజ సౌభ్రాత్వాన్ని పెనవేసేలా చేశాయి. కొన్ని విషయాల్లో మనలో మనకు కొన్ని పొరపొచ్చాలు రావొచ్చు. కానీ చివరకు అందరం ఇరుగుపొరుగున కలిసే జీవిస్తున్నాం. కలిసి పనిచేస్తున్నాం. చివరకు ఒకరినొకరం గౌరవించుకుంటున్నాం.
శ్రీలంక ఆర్థిక పురోభివృద్ధికి భారత్ ఎంతగానో సాయపడుతోంది. కష్టకాలంలో మా ఆర్థిక స్థిరత్వం, ప్రగతికి భారత్ అండగా నిలబడింది. 2022లో తీవ్ర ఆర్థికసంక్షోభంలో మేం కూరుకుపోతే భారత్ రుణసాయం చేసింది. ఈ సాయాన్ని మేం ఏనాటికీ మరువం. ఇరుదేశాల భాగస్వామ్యం నేటి తాత్కాలిక అగత్యం కాదు. రేపటి శాశ్వత అవసరం. గత డిసెంబర్‌లో మా దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె ఢిల్లీలో పర్యటించడం, ఏప్రిల్‌లో లంకలో మోదీ పర్యటన బలపడుతున్న ఇరుదేశాల బంధానికి గుర్తులు’’అని ఆమె అన్నారు.