
కింగ్ ఛార్లెస్‌బ్రిటిష్ ఎంపైర్ మెడల్ అందుకున్న భారతీయ కళాకారిణి
లండన్: భారతీయ నృత్యరూపకం కూచిపూడికి బ్రిటన్‌లో ఎనలేని గుర్తింపు తెస్తూ దేశవ్యాప్తంగా భారతీయ కళకు మరింత వన్నె తెచ్చిన ప్రముఖ నాట్యకళాకారిణి అరుణిమ కుమార్‌ను యూకే సర్కార్ అరుదైన గౌరవంతో సత్కరించింది. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 ‘గౌరవ బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం)’తో అరుణిమను గౌరవించారు. ఒక కూచిపూడి కళాకారిణి ఈ మెడల్‌ను సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా ప్రదర్శిస్తూ భారత్, బ్రిటన్‌సహా పలు దేశాల మధ్య సాంస్కృతి సంబంధాల బలోపేతానికి ఆమె తన కూచిపూడి కళ ద్వారా కృషిచేశారని బ్రిటన్ రాజకుటుంబం పేర్కొంది. యూకేలో పౌర, సైనిక కార్యకలాపాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజు ప్రతిఏటా ఈ పురస్కారాన్ని ప్రదానంచేస్తారు. అరుణిమ ఇప్పటికే బ్రిటన్ సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాత సాధించారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 వర్ధంతి వేడుకల్లో, బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో, లండన్‌లోని యూకే ప్రధాని కార్యాలయం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అరుణిమ ఎన్నోసార్లు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ నృత్యరూపం అంబాసిడర్‌గా, ఇన్‌ఫ్లూయన్సర్‌గా, సాంస్కృతిక సారథిగా అరుణిమకు మంచి పేరుంది. తనకు బ్రిటిష్ ఎంపైర్ మెడల్ రావడంపై అరుణిమ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘రాజు నుంచి గౌరవ పురస్కారం పొందడం నిజంగా ఎంతో గర్వంగా, సముచితంగా గౌరవంగా అనిపిస్తోంది.
కళలో నా కృషిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఇది నా వ్యక్తిగత గుర్తింపుగా భావించట్లేను. అంతర్జాతీయ వేదికపై భారతీయ శాస్త్రీయ నాట్యానికి దక్కిన గౌరవం. కూచిపూడి నాకు జీవితాంతం తోడుంటుంది. నా భావాల వ్యక్తీకరణకు మాధ్యం కూచిపూడి’’అని ఆమె అన్నారు. ఈమెకు చెందిన ‘అరుణిమ కుమార్ డ్యాన్స్ అకాడమీ’50కిపైగా దేశాల్లో 3,000కుపైగా నృత్య ప్రదర్శనలు ఇచి్చంది. ఐదేళ్ల చిన్నారి మొదలు 75 ఏళ్ల వృద్దుల దాకా ఈమె వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఈమెకు వందలాది మంది శిష్యులు ఉన్నారు. పద్మ భూషణ్ శ్రీమతి స్వప్నసుందరి, పద్మశ్రీ జయరామారావు వద్ద అరుణిమ శిష్యరికం చేసి కూచిపూడిలో నైపుణ్యం సాధించారు.