స్వేచ్ఛా విపణితో భారత్, ఆసియాన్ దేశాల ప్రజలకుఎంతో ప్రయోజనమని వ్యాఖ్య
అమెరికా సుంకాల మోత వేళ ఆసియాన్‌తో బంధం బలోపేతంపై దృష్టి
అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధికి భారత్–ఆసియాన్ భాగస్వామ్యమే గట్టి పునాది
ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని
ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం సవాల్‌గా మారిందని ఆందోళన వ్యక్తంచేసిన మోదీ
ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశి్చత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.
కౌలాలంపూర్/న్యూఢిల్లీ: ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు.
మలేసియాలోని కౌలాలంపూర్ నగరంలో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ అన్నారు. ఆసియాన్–ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్(ఏఐటీఐజీఏ)ను వీలైనంత త్వరగా సమీక్షించాలని మోదీ అభిలషించారు.
మోదీ ప్రసంగ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఏఐటీఐజీఏ ఒప్పందం 15 ఏళ్ల క్రితం అమల్లోకి వచి్చంది. ఇప్పుడు భారత్–ఆసియాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమైతే ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రాంతీయ సహకారం సైతం ఇనుమడిస్తుంది’’అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ సందర్భంగా ఆసియాన్, భారత్‌ల ఆర్థిక ప్రగతికి బాటలువేసే కీలకమైన సుస్థిర పర్యాటకంపై ఇరువర్గాలు ఒక ప్రకటన విడుదలచేశాయి. ‘‘ఇండో–పసిఫిక్‌లో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) కూటమికి భారత్ గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం(2026–2030) అమలు కోసం ఆసియాన్–భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కు మద్దతు పలుకుతున్నాం. త్వరలో రెండో ఆసియాన్–భారత్ రక్షణ మంత్రుల సమావేశం, రెండో ఆసియాన్–భారత్ నౌకావిన్యాసాలు జరుపుదాం’’అని మోదీ అన్నారు.
నాలుగో వంతు మనమే
‘‘విశ్వమానవాళిలో నాలుగో వంతు జనాభాకు భారత్, ఆసియాన్ దేశాలే ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. జనాభాను మాత్రమే కాదు మనం అత్యంత చరిత్రాత్మకమైన ఒప్పందాలు, విలువల బంధాలతో పెనవేసుకుపోయా. గ్లోబల్ సౌత్‌లో మనం కలిసి ముందడుగువేస్తున్నాం. కేవలం వాణిజ్య భాగస్వాములం కాదు సాంస్కృతిక సహచరులం. భారత్ అవలంభిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ అనేది పునాదిరాయి. ఆసియాన్ లక్ష్యాలకు, ఇండో–పసిఫిక్ విషయంలో ఆసియాన్ వైఖరికి భారత్ ఎల్లవేళలా పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతోంది.
ఒడిదుడుకుల కాలంలోనూ భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది సుస్థిరాభివృద్ధిని కొనసాగించింది. ఈ బలమైన బంధమే యావత్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి, ప్రగతికి కొత్త అంకురార్పణ చేస్తోంది. భారత్, ఆసియాన్ రెండూ విద్య, పర్యాటకం, శాస్త్రసాంకేతిక, ఆరోగ్య, శుద్ధ ఇంధనం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మరింత బలమైన పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఇకమీదట సైతం సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకునేందుకు కలిసి పనిచేస్తాం. భారత, ఆసియాన్ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంచుతాం. ఇందుకోసం భుజం భుజం కలిపి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమం కోసం 400 నిపుణులకు పునరుత్పాదక ఇంధన రంగంలో శిక్షణనిప్పిస్తాం ’’అని మోదీ అన్నారు.
సవాళ్లు ఎదురవుతున్నా..
అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా డిజిటల్ సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత, సరకు రవాణా గొలుసు వంటి అంశాల్లో ఆసియాన్ దేశాలు సమష్టిగా పోరాడుతూ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తమైన ‘సమ్మిళిత సుస్థిరత’భావనను శిఖరాగ్రాలపై నిలిపాయి. ఆసియాన్ దేశాల ప్రాధాన్యతలను మద్దతు పలుకుతూనే ఆసియాన్ దేశాలను ఇలాగే సమష్టిగా కలిపి ఉంచేందుకు భారత్ కృషిచేస్తుంది. ఆపత్కాలంలో ఆసియాన్ దేశాలను ఆదుకునేందుకు భారత్ సదా ఆపన్నహస్తం అందించింది. మనవతా సాయం, విపత్తు సాయం, సముద్రయాన భద్రత, సాగరసంబంధ వాణిజ్యాభివృద్ధికి భారత్ అండగా నిలబడుతుంది. 2026 ఏడాదిని ‘ఆసియాన్–భారత్ సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటిస్తున్నాం’’అని మోదీ చెప్పారు.


