లండన్: గతేడాది బీబీసీలో ప్రసారమైన డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేయడంతో తలెత్తిన వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ హెడ్ డెబొరా టర్నెస్ రాజీనామా చేశారు. బీబీసీ చైర్మన్ సమీర్ షా కూడా చెప్పారు. అయినప్పటికీ చట్ట పరమైన చర్యల కోసం కోర్టు కెళతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. కనీసం కోటి నుంచి 5 కోట్ల డాలర్ల వరకు తాము పరిహారం కోరే అవకాశముందని శనివారం ఆయన తెలిపారు. ‘మోసానికి పాల్పడినట్లు బీబీసీయే ఒప్పుకుంది. కానీ, క్షమాపణలను చెప్పాల్సిన విధంగా చెప్పలేదు. వాళ్లు మోసం చేశారు.
నేను చెప్పని మాటలను చెప్పినట్లుగా డాక్యుమెంటరీలో ప్రసారం చేశారు’అని ట్రంప్ ఆరోపించారు. 2021 జనవరి 6వ తేదీన ట్రంప్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేయడంలో పొరపాటు జరిగిందని, తామలా ఉద్దేశపూర్వకంగా చేయలేదని గురువారం బీబీసీ వివరణ ఇచ్చుకుంది. అయితే, పరిహారం చెల్లించేది లేదని తెలపడంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. తాము మరోసారి ఇలాంటి తప్పిదం చేయమంటూ బీబీసీ ఇచ్చిన వివరణను సైతం ఆయన తప్పుబట్టారు. ‘మీరు చేయకపోవచ్చు, ఇతరులు చేస్తే మాత్రం ఆపరు..ఇదే కదా మీ ఉద్దేశం’అంటూ బీబీసీపై కారాలు మిరియాలు నూరారు. దావా వేయాలని తాము అనుకోవడం లేదన్న ఆయన, అలా చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించారు.


