అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి
ఫ్లోరిడా రిసార్ట్‌లో ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీతో భేటీ
యుద్ధాన్ని ముగించడంపై చర్చ
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. శాంతి ఒప్పందం విషయంలో ఆ రెండు దేశాలు ఎన్నడూ లేనంత సమీపంలోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం ఫ్లోరిడాలోని ఓ రిసార్ట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ భేటీ జరగడం విశేషం.
ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంతోపాటు యుద్ధం ముగించడంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెలెన్‌స్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. భేటీ అనంతరం జెలెన్‌స్కీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధినేత పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్‌స్కీ నిజంగా ధైర్యవంతుడైన నాయకుడు అంటూ కొనియాడారు. మరోవైపు జెలెన్‌స్కీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి దిగడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడింది.
ఏం చర్చించారు?
ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. కొన్ని అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉక్రెయిన్‌కు సంబంధించిన కొన్ని భూభాగాలను రష్యా ఆక్రమించింది. వాటిని తిరిగి అప్పగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా రష్యా అంగీకరించడం లేదు. వాటిపై హక్కులు వదులుకోవడంతోపాటు రష్యాలో అంతర్భాగంగా అధికారికంగా గుర్తిస్తేనే యుద్ధాన్ని ఆపేస్తామని తేలి్చ చెబుతోంది. ఇందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా భద్రతాపరమైన గ్యారెంటీలు ఇవ్వాలని కోరుతోంది. ఈ రెండు ముఖ్యమైన అంశాలపైనే ట్రంప్, జెలెన్‌స్కీ చర్చించినట్లు తెలుస్తోంది.
యూరోపియన్ నాయకులతో సమావేశం కావాలని వారిద్దరూ నిర్ణయించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్‌తోపాటు ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, పోలాండ్ తదితర దేశాల అధినేతలతో సమావేశం ఏర్పాటుచేస్తానని ట్రంప్ చెప్పారు. వచ్చే నెలలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. శాంతి కోసం ట్రంప్ ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ఆయనకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, రష్యా అధినేత పుతిన్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. శాంతి ఒప్పందంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు.


