అమెరికా దౌత్యంతో ఉక్రెయిన్ సంక్షోభం ఓ కొలిక్కి వస్తుందని భావించేలోపు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగిందని రష్యా ప్రకటించింది. పైగా ఇది ఉక్రెయిన్ పనేనంటూ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను కీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. మరోవైపు ఈ దాడిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో రిసార్ట్‌లో ట్రంప్ సమావేశం అయ్యారు. ఆ భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం గురించి నాకు ఎవరు సమాచారం ఇచ్చారో తెలుసా?. స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆయన నాకు ఫోన్ చేసి దాడి జరిగిందని అన్నారు. ఆయనపై దాడి జరిగిందని. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేను చాలా కోపంగా ఉన్నాను అని ట్రంప్ అన్నారు.
అయితే దాడిపై కూడా ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. డ్రోన్ దాడి జరగకపోయి ఉండొచ్చని.. అందుకు ఆస్కారం ఉందని కూడా వ్యాఖ్యానించారు. ‘‘ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించడం ఒక విషయం. కానీ ఆయన ఇంటిపై దాడి చేయడం మరో విషయం. ఇప్పుడే అలాంటి పనులు చేయడానికి సరైన సమయం కాదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా సోమవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పిత కథనాలేనని, రష్యా మరిన్ని దాడులకు కారణాలు చూపించుకోవడానికి, శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. ఉత్తర రష్యాలోని నోవ్‌గొరోడ్ ప్రాంతంలో ఉన్న అధ్యక్ష నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ రాత్రిపూట డ్రోన్ దాడి చేసిందని అన్నారు. అయితే రష్యా వాయుసేన రక్షణ వ్యవస్థలు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని, ఎలాంటి ప్రాణ నష్టం/ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. రష్యా దీనికి తప్పకుండా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే లక్ష్యాలను గుర్తించామని చెప్పారు. అలాగే..
ఈ పరిణామంతో శాంతి చర్చలపై రష్యా తన వైఖరిని పునఃపరిశీలించాల్సి వస్తుందని తెలిపారు. అంతమాత్రాన ఉక్రెయిన్‌తో జరుగుతున్న శాంతి చర్చల నుంచి మాత్రం తప్పుకోబోమని స్పష్టం చేశారు. ఆ సమయంలో పుతిన్ ఆ నివాసంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని రష్యా స్పష్టంగా చెప్పలేదు. డోల్గియే బొరోడీ అనే ఆ నివాసాన్ని గతంలో జోసెఫ్ స్టాలిన్, నికితా ఖ్రుష్చెవ్, బోరిస్ యెల్త్సిన్, పుతిన్ వంటి సోవియట్, రష్యా నేతలు ఉపయోగించారు.
రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పూర్తిగా తిరస్కరించారు. ఇది “మరో అబద్ధాల పరంపర” అని వ్యాఖ్యానించారు. దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికి, కీవ్‌పై కొత్త దాడులు చేయడానికే రష్యా ఈ కథలు సృష్టిస్తోందని అన్నారు. సున్నితమైన దౌత్య చర్చల సమయంలో రష్యా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత పెంచుతోందని ఆరోపించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా బెదిరింపులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాలని కోరారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా స్పందించారు.


