ఇస్లామాబాద్: పాకిస్తాన్ వ్యాప్తంగా కనీసం 2.5 కోట్ల మంది బాలలు బడిబయటే ఉన్నారు. వీరిలో కనీసం 2 కోట్ల మంది బడి ముఖమే ఎరుగరు. ఏ విద్య సంస్థలోనూ పేరు నమోదు చేయించుకోని 1,084 మంది ట్రాన్స్ జెండర్ బాలలు సైతం వీరిలో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(పీఐఈ) విడుదల చేసిన నివేదిక మీడియాలో ప్రసారమవుతోంది. అందరికీ విద్య అందుబాటులో లేదనే విషయం ఈ నివేదికతో స్పష్టమవుతోందని సామాజికవేత్తలు అంటున్నారు.
స్కూలుకు వెళ్లని బాలలు అత్యధికంగా 96 లక్షల మంది పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్నారు. ఆ తర్వాత సింథ్‌లో 78 లక్షలు, ఖైబర్ ప్రావిన్స్‌లో 49 లక్షలు, బలూచిస్తాన్‌లో 29 లక్షలమంది బాలలు అక్షరజ్ఞానానికి నోచుకోవడం లేదని నివేదిక తెలిపింది. సాక్షాత్తూ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో 6–16 ఏళ్ల మధ్యనున్న కనీసం 89 వేల మంది బాలలు బడి బయటే గడుపుతున్నట్లు పీఐఈ తెలిపింది. దేశంలో ఇటువంటి వారి సంఖ్య ఏడాదికి 20వేల చొప్పున పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.


