భారత్‌పై పాక్ సెనేటర్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నదీ జలాలను ఆయుధంగా మార్చుకోవడం వల్ల మరింతగా పెచ్చరిల్లు తాయని పాకిస్తాన్ సెనేటర్ షెర్రీ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ అయిన షెర్రీ రెహ్మాన్.. చీనాబ్ నదిపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం పయ్రత్నాలు ప్రారంభించిన వేళ పైవిధంగా వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
వాతావరణ మార్పుల కారణంగా అత్యంత ప్రభావితమవుతున్న ఈ ప్రాంతంలో, నీటిని ఒక ఆయుధంగా (water weaponisation) మార్చుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికే శత్రుత్వం, అపనమ్మకంతో నిండిపోయి ఉన్న రెండు దేశాల సంబంధాల్లో ఇది ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది’ అని షెర్రీ రెహ్మాన్ (Sherry Rehman) సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నారు.
కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక దాడి నేపథ్యంలో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) నుంచి వైదొలగుతున్నట్లు భారత ప్రభుత్వం ఏప్రిల్ 22న ప్రకటించడం తెల్సిందే. కశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజీ–2 జల విద్యుత్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది.


