బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్‌పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్‌లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.
ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్‌లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.
ఇటీవల పాక్‌పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్‌ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్‌బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్‌ప్లోసివ్స్‌తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.
అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
1948లో పాక్‌లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది.


