
మంత్రి ముత్తాఖీతో భేటీ అనంతరం విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడి
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని భారత్ టెక్నికల్ మిషన్ ఇకనుంచి దౌత్య కార్యాల యంగా మారనుంది. అంతేకాదు, తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించనుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఈ విషయాలను ప్రకటించారు. భద్రతాపరమైన భారత ప్రభుత్వ ఆందోళనలపై సానుకూలంగా స్పందించిన తాలిబన్లను ఆయన అభినందించారు.
పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించి భారత్‌కు సంఘీభావం తెలపడం ముఖ్యమైన విషయ మన్నారు. ఆ దేశంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధ రించడంతోపాటు కొత్తగా ఆరింటిని ప్రారంభించనున్నామన్నారు. సుహృద్భావ సూచనగా 20 అంబులెన్సులను కానుకగా అందజేయనున్నట్లు చెప్పారు. ముందుగా ఐదు అంబులెన్సులను స్వయంగా మంత్రి ముత్తాఖీకి అందజేశానని జై శంకర్ తెలిపారు.
భారత్‌లో ఆరు రోజుల పర్యటనకు వచ్చిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీతో మొదటిసారిగా జై శంకర్ శుక్రవారం భేటీ అయ్యారు. భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకునేందుకు ఎవరికీ అవకాశ మివ్వబోమని ముత్తాఖీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు దేశాలతోపాటు ఈ ప్రాంతమంతటికీ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సవాలుగా మారిందని అంగీకరించారు.
ఈ ఉగ్ర గ్రూపుతో తాము సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. భారత కంపెనీలు తమ దేశంలో గనులు, ఖనిజాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనివల్ల రెండు దేశాల వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు. రెండు దేశాల మధ్య నేరుగా అదనంగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు. అనంతరం, ముత్తాఖీ మీడియాతో మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు దశల వారీగా చేపట్టే చర్యల్లో భాగంగా భారత్‌కు దౌత్యాధికారులను కూడా పంపిస్తామన్నారు.
మహిళా జర్నలిస్టులకు అందని ఆహ్వానం
అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోకి మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం పంపకపోవడం వివాదానికి దారి తీసింది. భారత్‌లో ఉన్నా తాలిబన్లు లింగ వివక్షను కొనసాగించడంపై నిరసన వ్యక్తమైంది. భారత ప్రజాస్వామిక విలువలకు ఇది అవమానకరమంటూ జర్నలిస్టులతో పాటు రాజకీయ నేతలు, నెటిజన్లు మండిపడ్డారు.
సహనాన్ని పరీక్షించొద్దు: ముత్తాఖీ హెచ్చరిక
మీడియా సమావేశంలో ముత్తాఖీ పాకిస్తాన్ తీరుపై మండిపడ్డారు. కాబూల్‌లోని తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) స్థావరాలే లక్ష్యంగా పాక్ వైమానిక దాడులకు దిగడంపై ఆయన స్పందిస్తూ.. అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించే సాహసం చేయొద్దంటూ ఆ దేశానికి గట్టి వార్నింగిచ్చారు. ‘సరిహద్దులు దాటి మా భూభాగంలో దాడికి పాల్పడి పాకిస్తాన్ తప్పు చేసింది. 40 ఏళ్ల తర్వాత శాంతిని, పురోగతి దిశగా సాగుతున్నాం. ఈ సమయంలో అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించవద్దు’ అని ముత్తా్తఖీ అన్నారు.