
న్యూయార్క్: భారత్‌పై విధించిన టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందని, ఇది సాధారణ విషయం కాదని అన్నారు. ఈ సుంకాల కారణంగా భారత్‌తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.
రష్యా చమురుకు భారత్ అతిపెద్ద కస్టమర్‌గా మారిందని ఆక్షేపించారు. దానికారణంగానే 50 శాతం టారిఫ్‌లు విధించక తప్పలేదని పునరుద్ఘాటించారు. నిజానికి అది చాలా పెద్ద నిర్ణయమని, దాన్ని మామూలు విషయంగా భావించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై మొండిగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా అధినేత పుతిన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. రష్యా మిత్రదేశమైన భారత్‌పై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఒకరకంగా చర్యలు తీసుకున్నట్లేనని వివరించారు.