
జమాత్ ఉల్ మొమినాత్ పేరుతో ఏర్పాటుచేసినట్టు ప్రకటన
మసూద్ అజహర్ సోదరి సాదియా నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం
సోషల్‌మీడియాలో జైషే కోసం ప్రచారం, చేరికలే ప్రధాన లక్ష్యం
ఆపరేషన్ సిందూర్‌లో చావుదెబ్బతిన్న తర్వాత ఉగ్ర సంస్థ కొత్త ఎత్తులు
ఇస్లామాబాద్: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ప్రకటించింది. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో.. జమాత్ ఉల్ మోమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది.
ఈ విభాగంలోకి ఈ నెల 8వ తేదీ నుంచి చేరికలు కూడా ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విభాగానికి మసూద్ అజహర్ సోదరి సాదియా అజహర్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. గత మే నెల 7న ఆపరేషన సిందూర్‌లో భాగంగా పాక్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న జైషే ప్రధాన కార్యాలయంపై భారత్ వైమానికదళం క్షిపణుల వర్షం కురిపించటంతో సాదియా భర్త యూసుఫ్ అజహర్‌తోపాటు మసూద్ కుటుంబసభ్యులు పలువురు మరణించారు.
ఉగ్రవాదుల భార్యలు, పేద యువతులే సభ్యులు
జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో పనిచేస్తున్న పురుష ఉగ్రవాదుల భార్యలను ఈ మహిళా విభాగంలోకి చేర్చుకుంటున్నట్లు తెలిసింది. బహావల్‌పూర్, కరాచి, ముజఫరాబాద్, కోట్లి, హరిపూర్, మాన్‌సేహ్రాలోని ఉగ్ర సంస్థ కేంద్రాల్లో చదువుకుంటున్న పేద యువతులను కూడా ఈ గ్రూపులో చేర్చుకుంటున్నట్లు సమాచారం. భారత్‌కు వ్యతిరేకంగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటమే జమాత్ ఉల్ మోమినాత్ ప్రధాన లక్ష్యమని తెలిసింది.
సోషల్‌మీడియా ద్వారా పాకిస్తాన్‌తోపాటు భారత్‌లోని జమ్ముకశీ్మర్, ఉత్తరప్రదేశ్, మరికొన్ని ప్రాంతాల్లో యువతను ఈ గ్రూప్ ఉగ్రవాదంవైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాద సంస్థలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు ఈ మహిళా గ్రూప్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఇప్పటివరకు మహిళలకు తమ సంస్థల్లో స్థానం కల్పించలేదు. జిహాద్ పేరుతో చేసే సాయుధ పోరాటాల్లో మహిళలకు స్థానం లేదని చెబుతూ వచ్చారు. కానీ, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చావుదెబ్బ కొట్టడంతో జైషే మహ్మద్ తన విధానాన్ని మార్చుకుంది.
ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న మసూద్ అజహర్, అతడి సోదరుడు తల్హా అల్ సైఫ్ ఇద్దరూ ఈ మహిళా విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. బహావల్‌పూర్‌లో భారత్ ధ్వంసం చేసిన జైషే ప్రధాన కార్యాలయాన్ని పునరి్నరి్మంచేందుకు ఆర్థికసాయం చేయనున్నట్లు ఇటీవలే పాక్ ప్రభుత్వం తెలిపింది. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా పేరుపడ్డ ఐఎస్‌ఐఎస్, బోకోహరాం, హమాస్‌ల్లో మహిళా విభాగాలు ఉన్నాయి. ఈ మహిళలతో ఆయా సంస్థలు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ చరిత్ర ఉంది.