
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో సుంకాల విషయంలో భారత్‌తో చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ట్రూత్’లో ప్రకటించారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ‘భారత్- అమెరికా సన్నిహిత మిత్రులు. సహ భాగస్వాములు. మా మధ్య జరిగే వాణిజ్య చర్చలు భారత్-అమెరికాల భాగస్వామ్య అపరిమిత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మార్గాన్ని సుగమం చేస్తాయని నమ్ముతున్నాను. ఈ చర్చలను వీలైనంత త్వరగా ముగించడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను కూడా ఎదురు చూస్తున్నాను. మా రెండు దేశాల ప్రజలకు మరింత సుసంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు మేము కలిసి పని చేస్తాం’ అని అన్నారు.
India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl
— Narendra Modi (@narendramodi) September 10, 2025
యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా- భారత్‌లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌లో ‘భారత్- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిలా ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనికిముందు అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక ప్రకటన చేస్తూ, భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ఆందోళన చెందేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రదాని మోదీ తీరుపై అసంతృప్తి ఉందని కూడా కామెంట్ చేశారు.