రెండు వారాల వ్యవధిలో ఇది రెండోది
ఆ దేశ ట్యాంకర్లను సీజ్ చేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మడురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని మరింతగా పెంచుతున్నారు. వెనెజులాకు చెందిన చమురు ట్యాంకర్‌ను శనివారం ఆ దేశ తీరానికి సమీపంలోనే అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇలా అడ్డగించడం ఇది రెండోసారి. ఆంక్షలు విధించిన ఆయిల్ ట్యాంకర్లను దిగ్బంధిస్తామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ నెల 10న అమెరికా బలగాలు మొదటిసారిగా ఓ ట్యాంకర్‌ను నిలువరించాయి. తాజా చర్యను హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ధ్రువీకరించారు.
సెంచరీస్ అనే పేరున్న ట్యాంకర్‌పైకి అమెరికా బలగాలు హెలికాప్టర్ ద్వారా దిగుతున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నార్కో టెర్రరిజానికి ఊతమిచ్చే ఆయిల్ రవాణాను అమెరికా అడ్డుకుంటుందని ఆమె తెలిపారు. పనామాకు చెందిన ముడిచమురు ట్యాంకర్ సెంచరీస్ ఇటీవల వెనెజులా తీరంలో కనిపించినట్లు మెరైన్ ట్రాఫిక్ అనే సంస్థ తెలిపింది. అయితే, సెంచరీస్ ట్యాంకర్ అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్నదీ లేనిదీ వెల్లడించలేదు. ఈ పరిణామంపై రక్షణ శాఖ గానీ, వైట్‌హౌస్ అధికారులు గానీ స్పందించలేదు. అయితే, అమెరికా చర్యలను నేరపూరితంగా వెనెజులా అభివర్ణించింది. ‘ఈ అంశాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకెళతాం. అమెరికాను వదిలేది లేదు, చట్టపరంగా ఎదుర్కొంటాం’అని స్పష్టం చేసింది.


