breaking news
venuzuelan president
-
దేనికైనా రెడీ.. ట్రంప్‌కు క్యూబా అదిరిపోయే కౌంటర్
హవానా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు క్యూబా కౌంటరిచ్చింది. నిబంధనలను నిర్దేశించే నైతిక అధికారం అమెరికాకు లేదంటూ ఘాటుగా స్పందించింది.అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో క్యూబా ఒక స్వేచ్ఛాయుతమైన, స్వతంత్ర, సార్వభౌమ దేశం. మేము ఏం చేయాలో ఎవరూ నిర్దేశించాల్సిన అవసరం లేదు. క్యూబా ఎప్పుడూ సంఘర్షణను కోరుకోదు. చివరి రక్తపు బొట్టు వరకు మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు క్యూబా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.మరోవైపు.. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ స్పందిస్తూ.. ప్రపంచ శాంతి ముప్పు కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది. నేరపూరిత రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు ఉన్నాయి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఏ దేశం నుండి అయినా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే హక్కు క్యూబాకు ఉందని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా, క్యూబా మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే, క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో, ట్రంప్ నిర్ణయం ఎలా ఉండనుంది అనే ఉత్కంఠ నెలకొంది.ట్రంప్ హెచ్చరికలు.. ఇక, అంతకుముందు క్యూబా విషయమై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు.ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచ్చిన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. -
వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించింది.‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు.అయినా ఆమె చాలా మంచి మనిషి’’అని అన్నారు. ‘‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్తో మాట్లాడా. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు. ‘‘గగనతల, భూతల, సముద్రమార్గాల్లో వెనెజువెలాపై అమెరికా తన అమేయ సాయుధశక్తి, యుక్తులను అసాధారణ స్థాయిలో ఉపయోగించింది. వెనెజువెలా సైనికకోట అయిన కరాకస్‌లో శత్రు దుర్భేద్యమైన సైనికస్థావరం నుంచి విజయవంతంగా మదురోను బంధించి తీసుకొచ్చి అమెరికా న్యాయదేవత ఎదుట నిలబెట్టాం. అమెరికా చేసిన ఘనకార్యాన్ని ప్రపంచంలో గతంలో ఏ దేశమూ చేయలేకపోయింది. మా ధాటికి వెనెజువెలా సైనికశక్తి నిర్వీర్యమైంది. నిజానికి మేం రెండో దఫా దాడి చేయాలనుకున్నాం.కానీ తొలిదెబ్బకే వెనెజువెలా బలగాలు గుడ్లు తేలేశాయి. దీంతో మా రెండో దఫా దాడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. మదురో దంపతులను సదరన్ డి్రస్టిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోర్టులో విచారిస్తాం. సముద్రమార్గంలో అమెరికాలోకి వచ్చే మాదకద్రవ్యాల్లో 97 శాతాన్ని అడ్డుకున్నాం. ఒక్కో పడవలో వచ్చే డ్రగ్స్ కారణంగా సగటున 25,000 మంది అమెరికన్లు చనిపోతున్నారు. వెనెజువెలాలోని ముడిచమురు కుంభస్థలాన్ని అమెరికా కొట్టబోతోంది. అమెరికా కంపెనీలు అక్కడికెళ్లి వ్యాపారం మొదలెట్టి చమురు తవ్వకం, అమ్మకాలతో వెనెజువెలా ‘చమురు మౌలికవసతి’ని పునరుద్ధరిస్తాయి. చమురు అమ్మకాలతో వచ్చిన సంపదతో వెనెజువెలాను బాగుచేస్తాయి. అమెరికా భాగస్వామ్యంతో వెనెజువెలా వాసులు ఇకపై ధనవంతులుగా, స్వతంత్రంగా, సురక్షితంగా జీవిస్తారు. అమెరికా పాలనలో వెనెజువెలా ఎంతో సంతోషంగా ఉండబోతోంది. వాళ్ల కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. అమెరికాలోకి ప్రమాదకర డ్రగ్స్‌ను సరఫరాచేసే మదురో నిజానికి ఒక నియంత. డీ లోస్ సోలెస్ డ్రగ్స్ ముఠాకు మదురోనే పెద్ద. మదురోను బంధించాక వెనెజువెలా ప్రజలు స్వేచ్ఛాజీవులయ్యారు. మా చట్టాల ప్రకారం శిక్షిస్తాం..మదురోను తమ అదుపులోకి తీసుకున్నాక అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డ్రగ్స్ మాఫియాతో మదురో దంపతులకూ సంబంధం ఉంది. అందుకే వాళ్లను బంధించి తీసుకొచ్చాం. న్యూయార్క్ చట్టాల ప్రకారం అమెరికా చట్ట నిబంధనల మేరకే అమెరికా గడ్డపై మదురో దంపతులకు శిక్ష పడేలా చేస్తాం’’ అని పామ్ అన్నారు. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం శనివారం మదురో దంపతులపై నేరారోపణలు చేసింది. ‘‘అవినీతి సర్కార్ దశాబ్దాల తరబడి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర మాదకద్రవ్యాల రవాణా ముఠాలతో స్వయంగా దేశ ప్రభుత్వం చేతులు కలిపింది’’ అని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. మరోవైపు సముద్రమార్గంలో అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలిస్తున్న నౌకలపై దాడులు పెంచామని శుక్రవారం నాటికి మొత్తంగా 35 నౌకలను నాశనం చేశామని.. సిబ్బంది సహా అందులోని సాయుధులను మొత్తంగా 115 మందిని అంతమొందించామని అమెరికా శనివారం ప్రకటించింది. కరాకస్‌లో మొదలైన ఆందోళనలు దేశాధ్యక్షుడిని బందీగా అమెరికా పట్టుకెళ్లడంపై కరాకస్ సిటీలో పౌరులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని నిరసన మొదలెట్టారు. వెనెజువెలాపై దాడి నేపథ్యంలో సమీప దేశమైన కొలంబియా అప్రమత్తమైంది. తమ దేశంలోకి వచ్చి పడే వెనెజువెలావాసులను అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గస్తోవ్ పెట్రో జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. తరచూ అమెరికాపై, ట్రంప్‌పై విమర్శలు గుప్పించే గస్తోవ్ తమ దేశం మీదా దాడి జరగొచ్చన్న అంచనాతో సైన్యాన్ని అప్రమత్తం చేశారు. అమెరికా సైతం వెనెజువెలాలో ఉన్న తమ పౌరుల రక్షణ కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ‘‘అమెరికన్లు ఎవరైనా వెనెజువెలాలో ఉంటే తక్షణం వెనక్కి వచ్చేయాలి. ఆ దేశం వైపు ఎవరూ వెళ్లొద్దు’’ అని పేర్కొంది. -
నొరిగా.. సద్దాం.. ఇప్పుడు మదురో
నచ్చని దేశాలను నయానో భయానో లొంగదీసుకోవడం, మాట వినకపోతే ఆయా దేశాల అధినేతలను శిక్షించడం అమెరికాకు పరిపాటిగా మారింది. పనామా సైనిక పాలకుడు మాన్యేల్ నొరిగా, ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్‌ను శిక్షించింది. ఇప్పుడు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను లక్ష్యంగా చేసుకుంది. ఆయన భవిష్యత్తు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. 1989లో అమెరికా సైన్యం టాటిన్ అమెరికా దేశమైన పనామాపై దండయాత్ర సాగించింది. అప్పటి సైనిక పాలకుడు మాన్యేల్ నొరిగాను గద్దె దించింది. అవినీతి, మాదక ద్రవ్యాలు, ప్రజాస్వామిక విధానాల నుంచి పనామాలోని తమ పౌరులను రక్షించడానికే ఈ చర్య తీసుకున్నామని అమెరికా సమర్థించుకుంది. 1988లో మియామీలో నొరిగా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. మరోవైపు పనామాలో అమెరికా వ్యతిరేక ఉద్యమాలకు నొరిగా మద్దతిచ్చారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఆయనపై నేరారోపణలు నమోదు చేసింది. అరెస్టు చేసి, జైలులో నిర్బంధించింది. 2010 దాకా నొరిగా జైలులోనే ఉన్నారు. మరో కేసులో విచారణ కోసం ఫ్రాన్స్‌కు తరలించింది. ఏడాది తర్వాత మళ్లీ పనామాకు తీసుకొచ్చింది. నొరీగా తన నేరాలకు శిక్ష అనుభవిస్తూ 2017లో జైలులోనే మరణించారని అమెరికా ప్రకటించింది. మరోవైపు అమెరికా కుట్రకు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది. ఇరాన్ వద్ద సామూహిక జన హనన ఆయుధాలున్నాయంటూ అమెరికా సర్కారు కన్నెర్ర చేసింది. 2003లో ఇరాక్‌పై యుద్ధం ఆరంభించింది. అదే సంవత్సరం డిసెంబర్ 13న అమెరికా సేనలు సద్దాం హుస్సేన్‌ను బంధించాయి. నిజానికి ఇరాక్‌లో ఎలాంటి సామూహిక జన హనన ఆయుధాలు లభించలేదు. అయినప్పటికీ సద్దాం హుస్సేన్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇరాక్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. 2006 డిసెంబర్ 30న సద్దాం హుస్సేన్‌కు ఉరిశిక్ష అమలు చేశారు. గిట్టని వారిని గద్దె దించి, శిక్షించడం అమెరికాకు కుట్రల్లో ఒక భాగంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నికోలస్ మదురోకు జైలుశిక్ష విధిస్తారా? లేక మరణశిక్ష విధిస్తారా? ఆయన గతి ఏమిటన్నది వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెనెజులా చమురు ట్యాంకర్‌ను అడ్డుకున్న అమెరికా
వాషింగ్టన్: వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మడురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని మరింతగా పెంచుతున్నారు. వెనెజులాకు చెందిన చమురు ట్యాంకర్‌ను శనివారం ఆ దేశ తీరానికి సమీపంలోనే అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇలా అడ్డగించడం ఇది రెండోసారి. ఆంక్షలు విధించిన ఆయిల్ ట్యాంకర్లను దిగ్బంధిస్తామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ నెల 10న అమెరికా బలగాలు మొదటిసారిగా ఓ ట్యాంకర్‌ను నిలువరించాయి. తాజా చర్యను హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ధ్రువీకరించారు. సెంచరీస్ అనే పేరున్న ట్యాంకర్‌పైకి అమెరికా బలగాలు హెలికాప్టర్ ద్వారా దిగుతున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నార్కో టెర్రరిజానికి ఊతమిచ్చే ఆయిల్ రవాణాను అమెరికా అడ్డుకుంటుందని ఆమె తెలిపారు. పనామాకు చెందిన ముడిచమురు ట్యాంకర్ సెంచరీస్ ఇటీవల వెనెజులా తీరంలో కనిపించినట్లు మెరైన్ ట్రాఫిక్ అనే సంస్థ తెలిపింది. అయితే, సెంచరీస్ ట్యాంకర్ అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్నదీ లేనిదీ వెల్లడించలేదు. ఈ పరిణామంపై రక్షణ శాఖ గానీ, వైట్‌హౌస్ అధికారులు గానీ స్పందించలేదు. అయితే, అమెరికా చర్యలను నేరపూరితంగా వెనెజులా అభివర్ణించింది. ‘ఈ అంశాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకెళతాం. అమెరికాను వదిలేది లేదు, చట్టపరంగా ఎదుర్కొంటాం’అని స్పష్టం చేసింది. -
ఆడాళ్లూ.. హెయిర్ డ్రయర్ వాడొద్దు!
ఆడవాళ్లు తలంటు పోసుకున్న తర్వాత.. జుట్టు ఆరబెట్టుకోడానికి హెయిర్ డ్రయర్లు వాడటంపై వెనిజువెలా అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రయర్లు వాడటం కంటే ఎంచక్కా చేతి వేళ్లను జుట్టులోకి పోనిచ్చి.. సహజంగానే ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుందని ఆయన అన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. అందుకోసం విద్యుత్ వాడకాన్ని తగ్గించడానికి అధ్యక్షుడు నికొలస్ మదురో ఈ తరుణోపాయం చూపించారు. డ్రయర్లు వాడుతుంటే విద్యుత్తు ఎక్కువగా ఖర్చవుతుందని, అందువల్ల వాడకం తగ్గాలంటే చేతివేళ్లతోనే జుట్టు ఆరబెట్టుకోవాలని ఆడాళ్లకు ఆయన సూచించారు. ఇలా చేస్తే సహజంగా ఉండటంతో పాటు చాలా అందంగా కనిపిస్తారని కూడా ఆయన అంటున్నారు. కానీ మహిళలు మాత్రం అధ్యక్షుడి సూచన విని ఆశ్చర్యపోతున్నారు. దేశంలో విద్యుత్ సమస్య దశాబ్ద కాలానికి పైగా ఉందని, దాన్ని అరికట్టడానికి తగిన చర్యలు ఏవీ తీసుకోలేదని మండిపడుతున్నారు. తమ జుట్టు వల్లే విద్యుత్ వాడకం ఎక్కువైపోతోందా అంటూ ఒంటి కాలిమీద లేస్తున్నారు.


