మాట వినకపోతే దండయాత్రలు, శిక్షలు
అమెరికా ఆధిపత్యానికి బలైన దేశాధినేతలు
నచ్చని దేశాలను నయానో భయానో లొంగదీసుకోవడం, మాట వినకపోతే ఆయా దేశాల అధినేతలను శిక్షించడం అమెరికాకు పరిపాటిగా మారింది. పనామా సైనిక పాలకుడు మాన్యేల్ నొరిగా, ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్‌ను శిక్షించింది. ఇప్పుడు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను లక్ష్యంగా చేసుకుంది. ఆయన భవిష్యత్తు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
1989లో అమెరికా సైన్యం టాటిన్ అమెరికా దేశమైన పనామాపై దండయాత్ర సాగించింది. అప్పటి సైనిక పాలకుడు మాన్యేల్ నొరిగాను గద్దె దించింది. అవినీతి, మాదక ద్రవ్యాలు, ప్రజాస్వామిక విధానాల నుంచి పనామాలోని తమ పౌరులను రక్షించడానికే ఈ చర్య తీసుకున్నామని అమెరికా సమర్థించుకుంది. 1988లో మియామీలో నొరిగా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది.
మరోవైపు పనామాలో అమెరికా వ్యతిరేక ఉద్యమాలకు నొరిగా మద్దతిచ్చారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఆయనపై నేరారోపణలు నమోదు చేసింది. అరెస్టు చేసి, జైలులో నిర్బంధించింది. 2010 దాకా నొరిగా జైలులోనే ఉన్నారు. మరో కేసులో విచారణ కోసం ఫ్రాన్స్‌కు తరలించింది. ఏడాది తర్వాత మళ్లీ పనామాకు తీసుకొచ్చింది. నొరీగా తన నేరాలకు శిక్ష అనుభవిస్తూ 2017లో జైలులోనే మరణించారని అమెరికా ప్రకటించింది.
మరోవైపు అమెరికా కుట్రకు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది. ఇరాన్ వద్ద సామూహిక జన హనన ఆయుధాలున్నాయంటూ అమెరికా సర్కారు కన్నెర్ర చేసింది. 2003లో ఇరాక్‌పై యుద్ధం ఆరంభించింది. అదే సంవత్సరం డిసెంబర్ 13న అమెరికా సేనలు సద్దాం హుస్సేన్‌ను బంధించాయి. నిజానికి ఇరాక్‌లో ఎలాంటి సామూహిక జన హనన ఆయుధాలు లభించలేదు.
అయినప్పటికీ సద్దాం హుస్సేన్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇరాక్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. 2006 డిసెంబర్ 30న సద్దాం హుస్సేన్‌కు ఉరిశిక్ష అమలు చేశారు. గిట్టని వారిని గద్దె దించి, శిక్షించడం అమెరికాకు కుట్రల్లో ఒక భాగంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నికోలస్ మదురోకు జైలుశిక్ష విధిస్తారా? లేక మరణశిక్ష విధిస్తారా? ఆయన గతి ఏమిటన్నది వేచి చూడాల్సిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్


