వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్‌ ప్రకటన | Donald Trump Key Statement On Venezuela | Sakshi
Sakshi News home page

వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్‌ ప్రకటన

Jan 4 2026 7:46 AM | Updated on Jan 4 2026 7:50 AM

Donald Trump Key Statement On Venezuela

వాషింగ్టన్‌: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్‌ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్‌ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించింది.

‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు.అయినా ఆమె చాలా మంచి మనిషి’’అని అన్నారు. ‘‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్‌తో మాట్లాడా. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్‌ వెల్లడించారు. ‘‘గగనతల, భూతల, సముద్రమార్గాల్లో వెనెజువెలాపై అమెరికా తన అమేయ సాయుధశక్తి, యుక్తులను అసాధారణ స్థాయిలో ఉపయోగించింది. వెనెజువెలా సైనికకోట అయిన కరాకస్‌లో శత్రు దుర్భేద్యమైన సైనికస్థావరం నుంచి విజయవంతంగా మదురోను బంధించి తీసుకొచ్చి అమెరికా న్యాయదేవత ఎదుట నిలబెట్టాం. అమెరికా చేసిన ఘనకార్యాన్ని ప్రపంచంలో గతంలో ఏ దేశమూ చేయలేకపోయింది. మా ధాటికి వెనెజువెలా సైనికశక్తి నిర్వీర్యమైంది. నిజానికి మేం రెండో దఫా దాడి చేయాలనుకున్నాం.

కానీ తొలిదెబ్బకే వెనెజువెలా బలగాలు గుడ్లు తేలేశాయి. దీంతో మా రెండో దఫా దాడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. మదురో దంపతులను సదరన్‌ డి్రస్టిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ కోర్టులో విచారిస్తాం. సముద్రమార్గంలో అమెరికాలోకి వచ్చే మాదకద్రవ్యాల్లో 97 శాతాన్ని అడ్డుకున్నాం. ఒక్కో పడవలో వచ్చే డ్రగ్స్‌ కారణంగా సగటున 25,000 మంది అమెరికన్లు చనిపోతున్నారు. వెనెజువెలాలోని ముడిచమురు కుంభస్థలాన్ని అమెరికా కొట్టబోతోంది. అమెరికా కంపెనీలు అక్కడికెళ్లి వ్యాపారం మొదలెట్టి చమురు తవ్వకం, అమ్మకాలతో వెనెజువెలా ‘చమురు మౌలికవసతి’ని పునరుద్ధరిస్తాయి. చమురు అమ్మకాలతో వచ్చిన సంపదతో వెనెజువెలాను బాగుచేస్తాయి. అమెరికా భాగస్వామ్యంతో వెనెజువెలా వాసులు ఇకపై ధనవంతులుగా, స్వతంత్రంగా, సురక్షితంగా జీవిస్తారు. అమెరికా పాలనలో వెనెజువెలా ఎంతో సంతోషంగా ఉండబోతోంది. వాళ్ల కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. అమెరికాలోకి ప్రమాదకర డ్రగ్స్‌ను సరఫరాచేసే మదురో నిజానికి ఒక నియంత. డీ లోస్‌ సోలెస్‌ డ్రగ్స్‌ ముఠాకు మదురోనే పెద్ద. మదురోను బంధించాక వెనెజువెలా ప్రజలు స్వేచ్ఛాజీవులయ్యారు.  

మా చట్టాల ప్రకారం శిక్షిస్తాం..
మదురోను తమ అదుపులోకి తీసుకున్నాక అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ శనివారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘డ్రగ్స్‌ మాఫియాతో మదురో దంపతులకూ సంబంధం ఉంది. అందుకే వాళ్లను బంధించి తీసుకొచ్చాం. న్యూయార్క్‌ చట్టాల ప్రకారం అమెరికా చట్ట నిబంధనల మేరకే అమెరికా గడ్డపై మదురో దంపతులకు శిక్ష పడేలా చేస్తాం’’ అని పామ్‌ అన్నారు. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం శనివారం మదురో దంపతులపై నేరారోపణలు చేసింది. ‘‘అవినీతి సర్కార్‌ దశాబ్దాల తరబడి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర మాదకద్రవ్యాల రవాణా ముఠాలతో స్వయంగా దేశ ప్రభుత్వం చేతులు కలిపింది’’ అని యూఎస్‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. మరోవైపు సముద్రమార్గంలో అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలిస్తున్న నౌకలపై దాడులు పెంచామని శుక్రవారం నాటికి మొత్తంగా 35 నౌకలను నాశనం చేశామని.. సిబ్బంది సహా అందులోని సాయుధులను మొత్తంగా 115 మందిని అంతమొందించామని అమెరికా శనివారం ప్రకటించింది.  

కరాకస్‌లో మొదలైన ఆందోళనలు 
దేశాధ్యక్షుడిని బందీగా అమెరికా పట్టుకెళ్లడంపై కరాకస్‌ సిటీలో పౌరులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని నిరసన మొదలెట్టారు. వెనెజువెలాపై దాడి నేపథ్యంలో సమీప దేశమైన కొలంబియా అప్రమత్తమైంది. తమ దేశంలోకి వచ్చి పడే వెనెజువెలావాసులను అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గస్తోవ్‌ పెట్రో జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. తరచూ అమెరికాపై, ట్రంప్‌పై విమర్శలు గుప్పించే గస్తోవ్‌ తమ దేశం మీదా దాడి జరగొచ్చన్న అంచనాతో సైన్యాన్ని అప్రమత్తం చేశారు. అమెరికా సైతం వెనెజువెలాలో ఉన్న తమ పౌరుల రక్షణ కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ‘‘అమెరికన్లు ఎవరైనా వెనెజువెలాలో ఉంటే తక్షణం వెనక్కి వచ్చేయాలి. ఆ దేశం వైపు ఎవరూ వెళ్లొద్దు’’ అని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement