న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం సంతకం చేశారు. దాంతో అది వీబీ–జీ రామ్ జీ చట్టం–2025గా అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ కూడా వెలువడింది.
గ్రామీణ ఉపాధి, అభివృద్ధి సాధన దిశలో ఇది కీలక మైలురాయిగా నిలవగల సంస్కరణ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 2047కల్లా భారత్ ను వికసిత దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో భాగంగానే కొత్త చట్టాన్ని తెచ్చినట్టు కేంద్రం వివరించింది. దీనికింద గ్రామీణులకు ఏటా కనీసం 125 పనిదినాలు కల్పించనున్నారు. ఈ బిల్లును నిరసనలు, ఆందోళనల మధ్యే గత వారం పార్లమెంటులో ప్రవేశపెట్టడం తెలిసిందే.
తమ హయాంలో వచ్చిందన్న ఒకే ఒక్క కారణంగా చరిత్రాత్మక ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ను కక్ష కొద్దీ మోదీ సర్కారు రద్దు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివ రాజ్ పాటిల్ తోసిపుచ్చారు. కొత్త చట్టంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇది ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కన్నా ఒకడుగు ముందున్న చట్టం’ అని ఆదివారం ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
శాంతి బిల్లుకు కూడా
పౌర అణు శక్తి రంగంలోకి ప్రైవేటు భాగస్వా ములను కూడా అనుమతించేందుకు ఉద్దేశించిన సస్టైనబుల్ హర్నెసింగ్ అండ్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ ఇండియా (శాంతి) బిల్లుకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ బిల్లుపై శనివారం ఆమె సంతకం చేశారు. ఆదివారం వెలువడ్డ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఈ మేరకు పేర్కొంది. 1962 నాటి అటామిక్ ఎనర్జీ యాక్ట్, 2010 నాటి సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు.


