లేక గాందీభవన్‌లో పాతరేశారా?
సోనియా గాందీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలను, 420 హామీలను గాలికి వదిలేశారా? లేక మూసీనదిలో కలిపారా? లేదంటే గాం«దీభవన్‌లో పాతరేశారా?’అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమెకు ఒక బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పుస్తకాన్ని ఢిల్లీకి వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీకు అందజేశారు. ఆ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ మీరు శుభాకాంక్షలు తెలిపారు.
కానీ.. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సెపె్టంబర్ 17వ తేదీన హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన మీరు, అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది.
ఈ రెండేళ్లలోఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు మీ పార్టీ ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయతి్నంచారా? కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా?’అని కిషన్‌రెడ్డి తన లేఖలో ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు మరిచి, తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారని మండిపడ్డారు.
‘ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? లేక గాం«దీభవన్‌లో పాతరేశారా?. తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి’అని కిషన్‌రెడ్డి నిలదీశారు.
ఇచ్చిన మాటమీద నిలబడండి..
‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త హామీలు ఇచ్చే ముందు, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి, మీరు ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మీరు ప్రకటించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై అధికారానికి దూరం చేస్తుంది’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాను’అని ఆ లేఖలో పేర్కొన్నారు.


