కేక్‌పై కానరాని ‘హ్యాపీ బర్త్‌డే’
‘సెక్యూరిటీ దగ్గర పెట్టేయ్’ అన్న మెసేజ్
జొమాటో పొరపాటు.. కేక్‌పై మారిన క్యాప్షన్
పుట్టినరోజు అంటే కేకులు, బహుమతులు, శుభాకాంక్షల సందేశాలతో సందడిగా ఉండాలి. కానీ జొమాటో డెలివరీలో జరిగిన ఒక చిన్న పొరపాటు.. ఒక పుట్టినరోజు వేడుకను నవ్వుల విందుగా మార్చేసింది. ఆ వింత అనుభవం ఏంటో చదవండి.
చెప్పిందొకటి.. రాసిందొకటి
నక్షత్ర అనే యువతి పుట్టినరోజు సందర్భంగా ఆమె స్నేహితుడు జొమాటోలో ఒక అందమైన కేక్ ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీ చేసే వ్యక్తికి అర్థం కావాలని సూచనల విభాగంలో ‘లీవ్ ఎట్ సెక్యూరిటీ’(సెక్యూరిటీ దగ్గర ఇచ్చేయండి) అని రాశాడు. పాపం ఆ కేక్ షాపు యజమాని దాన్ని పొరపాటుగా అర్ధం చేసుకున్నాడు. అదేదో కేక్ మీద రాయాల్సిన శుభాకాంక్షల సందేశం అనుకున్నాడు.
కళ్లు తేలేసిన బర్త్‌డే బేబీ
కేక్ బాక్స్ తెరవగానే నక్షత్ర కళ్లు తేలేసింది. కేక్ మీద ఉండాల్సిన ’హ్యాపీ బర్త్‌డే’ మాయమై, నీటుగా ‘లీవ్ ఎట్ సెక్యూరిటీ’అని రాసి ఉంది. ఆమె ఆశ్చర్యంతో చూస్తుంటే, పక్కన ఉన్న స్నేహితులు మాత్రం ఆ కేక్ చూసి నవ్వు ఆపుకోలేక కిందపడిపోయారు. ఆ గందరగోళాన్ని ఆమె వీడియో తీసి ఇన్‌స్టా్రగామ్‌లో పోస్టు చేయడంతో.. అది కాస్తా వైరల్‌గా మారింది.
దీనిపై ఒక నెటిజన్ వెటకారంగా స్పందిస్తూ.. ‘జొమాటో డెలివరీ సూచనల విషయంలో ఎప్పుడూ పొరపాటు చేయదు!’.. అని వ్యాఖ్యానించాడు. ఒకసారి మా అమ్మ పుట్టిన రోజుకి ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా.. అని రాయి’.. అని సూచిస్తే.. వాళ్లు యథాతథంగా కేకుపై ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా.. అని రాయి’ అని రాసేశారు.. అని తన పాత జ్ఞాపకాన్ని ఇంకో నెటిజన్ గుర్తు చేసుకున్నారు.
‘మరిచిపోలేని కామెడీ’.. ఉచిత డెలివరీ
కేక్ మీద ఉండాల్సిన ‘హ్యాపీ బర్త్ డే’కాస్తా.. ఇలా ‘సెక్యూరిటీ’పాలవడంతో.. ఆ పుట్టినరోజు వేడుక కాస్తా నవ్వుల జాతరలా మారిపోయింది. నిజానికి ఆ ’మెసేజ్’ చూశాక.. కేక్ కట్ చేయాలా? లేక సెక్యూరిటీ గార్డ్‌కి పార్సిల్ చేయాలా?.. అన్నది ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఆ కేక్ రుచి ఎలా ఉన్నా.. జొమాటో వారు మాత్రం ఆమెకు ‘మర్చిపోలేని కామెడీ’ని ఉచితంగా డెలివరీ చేసేశారు. ఆ మెసేజ్ పుణ్యమా అని కేక్ కడుపులోకి వెళ్లకముందే, నవ్వులతో అందరి కడుపులు నిండిపోయాయన్నమాట!
– సాక్షి, నేషనల్ డెస్క్


