కాంగ్రెస్‌పై మోదీ నిప్పులు
అధికారమే ఆ పార్టీ ఏకైక లక్ష్యం
చొరబాటుదారులు అసోంలో స్థిరపడేందుకు అండదండలు
నామ్ రూప్ సభలో ప్రధాని
భారీ ఎరువుల ప్లాంట్ ప్రారంభం
రెండు రోజుల పర్యటనకు తెర
నామ్ రూప్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ పార్టీ తలమునకలుగా ఉందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అసోంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సాయం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అందుకే ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓటు బ్యాంకు తప్ప దానికి మరేమీ పట్టదు.
ఎలాగైనా అధికారాన్ని ఒడిసిపట్టడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యం‘ అని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న అసోంలో దిబ్రుగడ్ జిల్లాలోని నామ్ రూప్ లో రూ.10,601 కోట్లతో నిర్మించిన భారీ ఎరువుల కర్మాగారాన్ని ఆదివారం ప్రధాని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ను దునుమాడారు. ‘‘ఆ రాష్ట్రంపై దానిది ఎప్పుడూ సవతి ప్రేమే. అస్సామీల అస్తిత్వం, సంస్కృతి, ప్రతిష్ఠ కాంగ్రెస్‌కు ఏనాడూ పట్టలేదు.
వాటి పరిరక్షణకు పాటుపడుతున్నది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ అనే విషం బారినుంచి అస్సాంను కాపాడాల్సిన అవసరముంది . ఈ విషయంలో బీజేపీ ఒక కవచంలా నిలుస్తుంది‘ అన్నారు. రాష్ట్రంలో దశాబ్దాల హింసాకాండకు శాశ్వతంగా తెర దించేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. నాటి అహోం రాజా వంశ పాలనలో ఉన్నంత శక్తిమంతంగా అసోంను తీర్చిదిద్ది తీరుతామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మోదీ చెప్పారు.
ద్రోహాలను కడుగుతున్నాం
దేశానికి కాంగ్రెస్ ఎన్ని ద్రోహాలు చేసిందో లెక్కే లేదని మోదీ అన్నారు. దాంతో, 12 ఏళ్లుగా తమ సర్కారు ఎంతగా సరిచేస్తున్నా, ఇంకా చక్కదిద్దాల్సిన తప్పిదాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘అసోం ఆణిముత్యం భూపేన్ హజారికాకు భారతరత్న ప్రకటిస్తే బాహాటంగా వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్ ది! ’ఆడిపాడే వారికి మోదీ భారతరత్న ఇస్తున్నాడు’ అంటూ ఎద్దేవా చేసి అస్సామీల మనసులకు తీరని గాయం చేసింది‘ అని మండిపడ్డారు.
రాష్ట్రంలో సెమీ కండక్టర్ విభాగం ఏర్పాటు చేసినా వ్యతిరేకించిన కాంగ్రెస్ ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామికీకరణ, కనెక్టివిటీ అస్సాం కలలు క్రమంగా సా చేస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. సభకు మహిళలు భారీగా తరలిరావడం హర్షణీయమని మోదీ అన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను భేటీ అయినపుడు ఆయనకు అసోం బ్లాక్ టీ పొడి కానుకగా ఇచ్చినట్టు గుర్తు చేశారు.
స్టూడెంట్స్‌తో బోటు షికారు
ప్రధాని మోదీ ఆదివారం ఉదయం అసోంలో బ్రహ్మపుత్రా నదిలో బోటు షికారు చేశారు. వినూత్నంగా క్రూయిజ్ షిప్ లో విద్యార్థులతో గంటపాటు పరీక్షా పే చర్చా కార్యక్రమం జరిపారు. పలు స్కూళ్లకు చెందిన 25 మంది స్టూడెంట్లు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు గువాహ తిలో అసోం ఆందోళన అమర వీరుల స్తూపం వద్ద మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోకి అక్రమ చొరబాట్లను వ్యతిరేకిస్తూ చేపట్టిన స్వహిద్ సమరక్ ఉద్యమంలో 860 మందికి పైగా అసువులు బాశారు. ఇందుకు గుర్తు నిర్మించిన స్వహిద్ సమరక్ క్షేత్ర వద్ద వెలిగే నిత్య ప్రమిదకు మోదీ ప్రణమిల్లారు. ఆయన రెండు రోజుల అసోం పర్యటన ఆదివారంతో ముగిసింది.


