కర్ణాటక: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్‌ఎల్‌ఎన్ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు..
ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర నివాసి హరీష్ ప్రసాద్‌కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది.
రూ.2 వేలు పంపి...
మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్‌పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్‌కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి.


