ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
కలబురగి (కర్ణాటక): అస్సాంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగనున్న అస్సాంలో మోదీ చేసిన ప్రసంగంపై ఖర్గే ఆదివారం తీవ్రంగా ప్రతిస్పందించారు. స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిం లీగ్, బ్రిటిష్ వారు కలిసి దేశ విభజనకు పునాదులు వేస్తున్నప్పుడు, అస్సాంను తూర్పు పాకిస్థాన్‌లో కలిపేందుకు కుట్ర పన్నారని, ఆ కుట్రలో కాంగ్రెస్ కూడా భాగస్వామి అయిందని మోదీ ఆరోపించారు. కేవలం గోపీనాథ్ బార్డోలోయ్ మాత్రమే సొంత పార్టీని ఎదిరించి అస్సాం అస్తిత్వాన్ని కాపాడారని ప్రధాని స్పష్టం చేశారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే..
దీనిపై ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘కేంద్రంలోనూ, అస్సాంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి రక్షణ కల్పించడంలో విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మీరు విఫలమైన ప్రతిసారీ విపక్షాలపై బురద చల్లడం తగదు. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’.. అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం రద్దు చేయడంపై కూడా ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాడి వంటిదన్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, ధనవంతులకు బానిసలుగా మార్చడానికే మోదీ ఈ చట్టాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రతి జిల్లాలోనూ ఆందోళనలు చేపడతామని ఖర్గే హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో హిందువుపై జరిగిన మూకదాడి ఘటనను ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలి. భారత ప్రభుత్వం వెంటనే ఆ దేశంతో మాట్లాడి హిందువుల రక్షణకు చర్యలు చేపట్టాలి’.. అని ఆయన డిమాండ్ చేశారు.


