
విశ్లేషణ
గాజాలో ‘శాంతి సాధన’ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రణాళికలో ‘మొదటి దశ’ అమలుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినట్లు 8వ తేదీ రాత్రి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనను హమాస్, ఇజ్రాయెల్ వెంటనే ధ్రువీకరించాయి. అది స్థూలమైన అంగీకారం. అమలు ఏ విధంగా అనే వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. యథాతథంగా ఈ మొదటి దశ అనే దానిలో కాల్పుల విరమణతో పాటు రెండు అంశాలున్నాయి. ఒకటి – ఇజ్రాయెలీ బందీలను హమాస్, వారి ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయటం. రెండు – ఇజ్రాయెలీ సేనలు ‘అంగీకృతమైన’ (అగ్రీడ్ అపాన్) రేఖ వద్దకు ఉపసంహరించుకోవటం. ఈ రెండు అంశాల అమలు ఎంత సాఫీగా జరగవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం. కాగా, రెండేళ్ళుగా సాగుతున్న గాజా మారణహోమంలో ఇపుడందరూ కొంత ఊపిరి తీసుకోగలరని మాత్రం చెప్పవచ్చు.
ఏది అంగీకృత రేఖ?
సరిగా రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై దాడి జరిపిన హమాస్, 250 మందిని బందీలుగా పట్టుకుంది. వారిలో ప్రస్తుతం సజీవులుగా 20 మంది, మృతదేహాల రూపంలో 28 మంది ఉన్నట్లు అంచనా. ఇజ్రా యెల్ వద్ద 250 మంది పాలస్తీనియన్లు జీవిత ఖైదీలుగా, సుమారు 1,300 మంది యుద్ధ ఖైదీలుగా ఉన్నట్లు చెప్తున్నారు. రెడ్ క్రాస్ ద్వారానో, మరొక విధంగానో వీరందరి విడుదలకు సమస్య ఉండక పోవచ్చు. కానీ, రెండవ అంశమైన ఇజ్రాయెలీ సేనల ఉపసంహరణ విషయం తేలటం తేలిక కాదు. ‘అంగీకృత రేఖ’ వద్దకు మాత్రమే పాక్షిక ఉపసంహరణ అన్నది ట్రంప్ ప్రణాళికలో గల అంశం కాగా, బందీలను తాము విడుదల చేయగానే పూర్తి ఉపసంహరణ జరగా లని హమాస్ షరతు పెడుతూ వచ్చింది. ఆ షరతును హమాస్ ఇప్పుడు సడలించిందా? ఏ విధంగా? ‘అంగీకృత రేఖ’ అర్థం పర స్పర అంగీకారమనా? లేక ట్రంప్, నెతన్యాహూల మధ్య అంగీ కారమా?
ఇందులో ‘అంగీకృత రేఖ’ అనే మాట గురించిన సందేహాలు అనవసరమైనవిగా తోచవచ్చు. కానీ, ట్రంప్ 20 సూత్రాల ప్రణా ళికను ఎవరితోనూ సంప్రతించకుండా ట్రంప్, నెతన్యాహూల మధ్య రూపొందిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఈ సందేహాలు సహేతు కమైన వని అర్థమవుతుంది. పైగా, మొదట తాము ట్రంప్‌కు చేసిన సూచనలను ట్రంప్, నెతన్యాహూ సమావేశం దరిమిలా మార్చివేశా రని అరబ్ నాయకులు బహిరంగంగా ఆరోపించటం కూడా గమనించదగ్గది. ‘అంగీకృత రేఖ’ అన్నది రాగల రోజులలో ఏ విధంగా ‘పరస్పర అంగీకృతం’ అయే రీతిలో రూపొందగలదో చూడవలసి ఉంటుంది.
ఆయుధాలు వదిలేస్తారా?
కాల్పుల విరమణ జరిగిన అనేక సందర్భాలలో ఏవో కారణా లతో ఏదో ఒక పక్షమో, ఇరుపక్షాలో ఉల్లంఘనలకు పాల్పడటం సర్వసాధారణం. ఇజ్రాయెల్‌కు సంబంధించి వారు లెబనాన్, సిరియా, గోలన్ కనుమలు, జోర్డాన్ ప్రాంతాలలో చేస్తున్నది అదే. అందువల్ల, గాజాలో ఉపసంహరణను పర్యవేక్షించేది, ‘అంగీకృత రేఖ’ వద్దకు ఉపసంహరణ తర్వాత నియంత్రించేది ఎవరో ఇంకా సూచనలు లేవు.
గాజా సమస్య కేవలం గాజాకు పరిమితమైనది కాదు. వెస్ట్ బ్యాంక్‌తో కలిపి మొత్తం పాలస్తీనా దేశం ఏర్పాటుకు సంబంధించినది. ఇప్పటికే 150 దేశాలు గుర్తించినప్పటికీ కేవలం ఇజ్రాయెల్ కోసమని అమెరికన్లు భద్రతా సమితిలో పదే పదే వీటో చేస్తున్న తమ విధానాన్ని మార్చుకుని, రెండు స్వతంత్ర దేశ వ్యవస్థలు ఏర్పడే వరకు ఈ సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఈ విషయమై ట్రంప్ 20 సూత్రాలలో అస్పష్టతలు, వంచనా కళలు తప్ప నిజా యతీ లేదు. గాజాకు సంబంధించి పాలస్తీనియన్లు, అరబ్బుల ఆలో చనలు ఒక విధంగా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ ఆలోచనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకొనేముందు... బందీలు, ఖైదీల విడుదల, అంగీకృత రేఖ వద్దకు సేనల ఉపసంహరణతో పాటుగా ఆ వెంటనే ముందుకు రాగల అంశాలేమిటో చూద్దాం. వాటిలో మొదటిది గాజా పౌరులకు సహాయం చేరటం. రెండవది హమాస్ నిరాయుధీకరణ. ఈ అంశాలు 20 అంశాలలో చేరి ఉన్నాయి గానీ, 8వ తేదీన ట్రంప్ చేసిన ప్రకటనలో లేవు. ఈజిప్టులో చర్చలు కొనసాగుతున్నందున సహజంగానే ముందుకు వస్తాయి. ఇందులో సహాయాల సరఫరాకు కూడా ఇంతకాలం ఆటంకాలు కల్పించిన ఇజ్రాయెల్, ఆ సహాయం హమాస్‌కు చేరుతున్నదనే వాదనలు చేసింది.
సరఫరాలపై తమకు పూర్తి నియంత్రణ ఉండా లన్నది. ఇది పరిష్కారం కావలసి ఉన్న విషయం. హమాస్ నిరాయుధీకరణ జరిగి తీరాలన్నది అమెరికా, ఇజ్రాయెల్‌ల పట్టు దల కాగా, స్వతంత్ర పాలస్తీనాకు మార్గం సుగమం అయ్యే వరకు ఆ పని చేయబోమని హమాస్ ప్రకటిస్తున్నది. కాకపోతే, గాజాలో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వాములం కాబోమని సూచించింది. అయితే, పాక్షిక నిరాయుధీకరణ కోసం ఒప్పించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారన్నవి 9వ తేదీ నాటి వార్తలు. పాక్షిక మంటే ఏమిటో, హమాస్ నిర్ణయమేమిటో తెలియాలి.
ధూర్త ఆలోచన
ఇవి రెండవ దశగా భావిస్తే, ట్రంప్ ప్రణాళికలోని తక్కినవన్నీ మహా సమస్యాత్మకమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే, స్వతంత్ర పాలస్తీనా అన్నదే లేకుండా ఆ రెండు భూభాగాలు తమ అధీనంలోకి రావాలన్నది అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఈ రోజు వరకు కూడా ఉన్న పథకం కాగా, అందుకు ససేమిరా అన్నది పాలస్తీనియన్ల చరిత్రాత్మకమైన జాతిపరమైన ఆకాంక్ష.
ట్రంప్ 20 సూత్రాలలో హమాస్ సంపూర్ణ నిరాయుధీకరణ, వారి రక్షణ వ్యవస్థలన్నింటి విధ్వంసం, ఆ సంస్థ కొత్త ప్రభుత్వంలో పాల్గొనకపోవటం, గాజాను డీ–ర్యాడికలైజ్ చేయటం, గాజా పరిపాలనకు బయటి వారితో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, అమెరికా ఆధ్వర్యంలో రక్షణ బలాలు, గాజాను సెజ్‌గా మార్చి, బయటివారే అభివృద్ధి ప్రణాళికలు రచించి, బయటి నిధులతో అభివృద్ధి పరచటం వంటివి ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా అథారిటీ తాము ఆశించిన విధంగా ‘తనను తాను పూర్తిగా సంస్కరించుకున్న పక్షంలో’ స్వీయ నిర్ణయాధికారం, పాలస్తీనా ఏర్పాటు విషయాలు అపుడు ఆలోచిస్తారు. ఇదెంత ముళ్ల దారో, ధూర్తమైనదో స్పష్టంగా కనిపిస్తున్నదే!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు