ప్రజాస్వామ్యంలో ఏకతా శక్తి | The true tribute we pay to Bharat Ratna Jaypee is to work for the betterment of India | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో ఏకతా శక్తి

Oct 11 2025 3:58 AM | Updated on Oct 11 2025 3:58 AM

The true tribute we pay to Bharat Ratna Jaypee is to work for the betterment of India

ధార్మిక, సాంస్కృతిక, జ్ఞాన భూమి అయిన బిహార్‌లో గంగా, ఘాఘరా నదుల సంగమ స్థానాన ఉన్న సితాబ్‌ దియారా గ్రామంలో 1902 అక్టోబరు 11న జయప్రకాశ్‌ నారాయణ్‌ జన్మించారు. మనమంతా ఆత్మీయంగా జేపీ అని పిలుచుకునే జయ ప్రకాశ్‌ నారాయణ్‌... గొప్ప రాజ నీతిజ్ఞుడు, ప్రజాస్వామ్య రక్ష కుడు, ‘సంపూర్ణ క్రాంతి’ రూప శిల్పి. ‘లోక్‌ నాయక్‌’ బిరుదు ఆయనకు ఎవరో పెద్దలుఇచ్చింది కాదు... 1974 జూన్‌ 5న పట్నాలోని గాంధీ మైదా నంలో సమావేశమైన లక్షలాది ప్రజలు ప్రేమతో ఆయనను ‘లోక్‌ నాయక్‌’ అని పిలిచారు. 

రాజకీయ చేతనకు పునాది 
సితాబ్‌దియారాలో ప్రాథమిక విద్య అనంతరం పట్నా వెళ్లిన ఆయనను అక్కడి జాతీయవాద వాతావరణం ఆకట్టుకుంది. ఇంట ర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో దేశంలో బ్రిటిష్‌ ఆక్రమణవాదా నికి వ్యతిరేకంగా సాగుతున్న అహింసాయుత, సహాయ నిరాకరణో ద్యమం ఆయనపై అమితమైన ప్రభావం చూపింది. అమెరికాలో ఏడేళ్ల విద్యాభ్యాస సమయంలో మార్క్సిజం వైపు ఆకర్షితుడయ్యారు. దేశంలో సమస్యలన్నింటికీ మార్క్సిజమే పరి ష్కారం చూపుతుందని ఆ సమయంలో భావించారు. 

అయితే, భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత ఈ దేశ పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయించే సాధ్యాసాధ్యాలను అన్వేషించిన అనంతరం... ‘ప్రజా స్వామ్య సామ్యవాదం’, ‘సర్వోదయ’ భావనలే ఇక్కడి సమస్యలకు పరిష్కారమన్న నిశ్చయానికి వచ్చారు. ఈ ఆచరణాత్మక దృక్పథమే జేపీ ఔచిత్యానికీ, రాజనీతిజ్ఞతకూ నిదర్శనం. 

శ్రమ విలువ తెలిసినవారు!
వినోబా భావే భూదానోద్యమాన్నీ, సర్వోదయ తాత్వికతనూ మేళవిస్తే దేశంలోని భూ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారం లభిస్తుందని 1952లో జేపీ భావించారు. 1954–73 మధ్య కాలంలో ఆయన చేపట్టిన చంబల్‌ బందిపోట్ల పునరావాసం, అహింసాయుత సంపూర్ణ విప్లవం వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునూ, ప్రశంసలనూ పొందాయి.  

‘శ్రమకు గౌరవం (డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌)’ అన్న భావనను జేపీ అర్థం చేసుకున్న తీరు కేవలం సైద్ధాంతికపరమైంది కాదు. స్వీయా నుభవాల నుంచి గ్రహించినదే. అమెరికాలో అభ్యసిస్తున్న రోజుల్లో ‘చదువుకుంటూనే సంపాదించుకోవడం’ ఆయనకు అలవడింది. ఆర్థిక అవసరాల కోసం చిన్న చిన్న పనులు చేశారు. నిజాయతీగల శ్రమకు గౌరవం, న్యాయబద్ధమైన వేతనాలు, మానవీయ పని వాతా వరణం ఉండి తీరాలన్న ఆయన నిశ్చయాన్ని ఇవి మరింత బలో పేతం చేశాయి. 

కార్మిక వర్గ సంక్షేమమే న్యాయబద్ధమైన సమాజానికి పునాది అన్న దృఢమైన నిశ్చయంతో ఆయన భారత్‌కు వచ్చారు. ముఖ్యంగా 1947లో మూడు ముఖ్యమైన అఖిల భారత కార్మికసంఘాలు – అఖిల భారత రైల్వే సిబ్బంది సమాఖ్య, అఖిల భారత పోస్టుమెన్‌ – టెలిగ్రాఫ్‌ దిగువ స్థాయి సిబ్బంది సంఘం, అఖిల భారత ఆయుధ కర్మాగారాల కార్మికుల సంఘాలకు ఆయన అధ్య క్షుడిగా ఎన్నికయ్యారు.

1960ల సమయంలో రుతుపవనాల వైఫల్యం బిహార్‌ను కరవు పరిస్థితిలోకి నెట్టింది. ఆ సమయంలో జేపీ తన భూదానోద్యమ సహచరులు, అనుచరులతో కలిసి ప్రజల బాధలను తగ్గించేందుకు సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. ‘బిహార్‌ రాహత్‌ కమిటీ’తో ఈ సమయంలోనే ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకుల ‘దేశ సేవా దృక్పథా’న్ని ప్రత్యక్షంగా చూశారు. అది ఆయననెంతో ప్రభావితం చేసింది. 

నా అనుభవం
జీవితంలో ప్రతి దశలోనూ అవినీతి సమస్యను ఎదుర్కొన్న జేపీ... భారతీయ సమాజ పునరుజ్జీవనం, పునర్నిర్మాణంలో భాగ స్వాములయ్యేలా దేశ యువతను ప్రేరేపించాల్సిన ఆవశ్యకతఉందని భావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్న తరుణంలో... ప్రజాస్వామ్య శక్తిపై వారిలో ఆశలనూ, నమ్మకాన్నీ పునరుద్ధరించారు. 1973లో వినోబా భావే పవనార్‌ ఆశ్రమం నుంచి ‘సంపూర్ణ విప్లవం’ దిశగా జేపీ స్పష్టంగా పిలుపు నిచ్చారు. 

ఆదర్శ మానవీయ సమాజాన్ని సాధించడమే ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమ లక్ష్యం. అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం గొంతె త్తిన ఆయన భావాలు నాటి రాజకీయాల్లో వేళ్లూనుకున్నాయి. ప్రజల్లో చైతన్యాన్ని రగల్చగల ఆయన సమర్థత, 1977లో దేశంలో ఓ కొత్త వ్యవస్థను నెలకొల్పే దిశగా వారి ఆగ్రహాన్ని ఆయన మళ్లించిన తీరు అనన్య సామాన్యం. 

19 ఏళ్ల యువకుడిగా కోయంబత్తూరు జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్ర టరీగా ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమంలో భాగస్వామినయ్యే అవకాశం దక్కడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఈ దశలో, దేశ చరిత్రలో అత్యంత కీలక సమయంలో నేను నేర్చుకున్న విషయాలు యువ కుడిగా ఉన్న నన్ను... ఆత్మవిశ్వాసంతో కూడిన, సామాజిక అవగా హన కలిగిన నాయకుడిగా తీర్చిదిద్దాయి.

మన ప్రియతమ నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ను ప్రేమగా గుర్తు చేసుకుంటున్న మనం... దేశ స్వాతంత్య్రోద్యమం కోసం నిస్వార్థంగా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన ఆయన జీవిత భాగస్వామి ప్రభావతీ దేవినీ మరవకూడదు. గాంధీ ఆదర్శాల సాధన కోసం నిస్వార్థంగా ఆమె తన శక్తినంతా వెచ్చించారు.

జేపీ వారసత్వం 
1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమం నుంచి 1970లో చేపట్టిన ‘సంపూర్ణ క్రాంతి’ దాకా... దేశం పట్ల ఉన్న ప్రేమ భావనే ఆయనను నిరంతరం ముందుకు నడిపింది. ప్రభుత్వంలో తనకు నచ్చిన పదవిని పొందే అవకాశం దొరికినప్పటికీ, అధికార వ్యామోహానికి ఆయనెప్పుడూ లొంగలేదు. నిస్వార్థ దేశసేవకే కట్టుబడి ఉన్నారు.  

ఎంత కఠినమైన సవాళ్లు ఎదురైనా, ప్రజలు తలచుకుంటే మార్పును తేగలరని చెప్పడానికి జేపీ జీవితం, బోధనలు నిదర్శనం. ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటూనే – సమానత్వం, న్యాయం, శాంతి నెలకొని ఉన్న సమాజాన్ని నిర్మించాలన్నది ఆయన బోధనల సారాంశం. సామాజిక, ఆర్థిక న్యాయమూ, రాజకీయ స్వేచ్ఛ విడదీయలేనివని ప్రకటించిన దార్శనిక నాయకుడాయన. 

విప్లవమంటే హింస అని భావించే అవకాశం ఉంది. కానీ, జేపీ చేపట్టిన సంపూర్ణ విప్లవానికి అహింసే ప్రాతిపదిక. అహింసాయుత ప్రజా ఉద్యమం ద్వారా... వ్యవస్థాగతంగానూ, సామాజికంగానూ మానవత, నైతికత విలువల ఆధారంగా భారత పురోగమనానికి ఆయన పునాది వేశారు. జాగరూకులమై, నిస్వార్థం, సేవ, సత్యసంధతతో భారత అభ్యున్నతికి కృషి చేయడమే మనం ‘భారతరత్న’ జేపీకి అందించే నిజమైన నివాళి.

-సి.పి. రాధాకృష్ణన్‌ 
భారత ఉప రాష్ట్రపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement